Friday, December 6, 2024

34వేల కోట్ల రికార్డు టర్నోవర్ దిశగా సింగరేణి… శ్రీధర్

సింగరేణి భవన్ : సింగ‌రేణి ఈ ఏడాది సుమారు 70మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తితో 34వేల కోట్ల రూపాయల టర్నోవర్ సాధించే దిశగా ముందుకు దూసుకుపోతోందని సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ ఎండీ ఎన్.శ్రీధర్ పేర్కొన్నారు. హైదరాబాద్ సింగరేణి భవన్ లో జరిగిన 74వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. సింగరేణి సంస్థ గత ఏడాది 26 వేల కోట్ల టర్నోవర్ సాధించిందన్నారు. సింగరేణి సంస్థ దేశాభివృద్ధికి తన వంతుగా బొగ్గు, థర్మల్ విద్యుత్తును అందిస్తోందని, ఆత్మ నిర్బర్ భారత్ లో భాగంగా మరో ఐదేళ్లలో 100 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతుందని పేర్కొన్నారు. భారతదేశం నేడు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ప్రతి ఏడాది 7 నుంచి 10 శాతం విద్యుత్ వినియోగం పెరుగుతోందని, దీనికి అనుగుణంగా బొగ్గుకు కూడా డిమాండ్ పెరుగుతోందన్నారు. సింగరేణి వంటి సంస్థకు ఇదొక సదవకాశమని, దీనిని దృష్టిలో పెట్టుకుని రానున్న ఐదేళ్లలో పది కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడానికి సింగరేణి సంసిద్ధమైందని తెలియజేశారు.

ఆత్మనిర్బర్ భారత్ లో భాగంగా మరో మూడు సంవత్సరాల్లో విదేశీ బొగ్గు దిగుమతులకు స్వస్తి పలకాలని యోచిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కోల్ ఇండియా, సింగరేణి వంటి ప్రభుత్వ సంస్థలకు 1200 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను నిర్దేశించిదని, వీటితో పాటు కొన్ని ప్రైవేటు సంస్థలకు కూడా కొత్త బొగ్గు బ్లాక్ లను కేటాయించడం జరిగిందన్నారు. పర్యవసానంగా రానున్న కాలంలో బొగ్గు మార్కెట్లో ప్రైవేట్ బొగ్గు ఉత్పత్తి దారులతో కొంత పోటీ పరిస్థితులు నెలకొంటాయని, అయినప్పటికీ సింగరేణి సంస్థ తన పనితీరు, అనుభవం, క్రమశిక్షణ వలన పోటీ మార్కెట్ ను తట్టుకోగలదన్నారు. ప్రతి కార్మికుడు ఉత్పాదకత పైన దృష్టి సారిస్తే, ఉత్పత్తి వ్యయం తగ్గి, తక్కువ ధరకే వినియోగదారుడికి బొగ్గు సరఫరా చేసే అవకాశం ఉంటుందన్నారు. తద్వారా పోటీ మార్కెట్ ను ఎదుర్కోగలమని పేర్కొన్నారు.

తన వ్యాపార విస్తరణలో భాగంగా సింగరేణి సంస్థ నిర్మించిన 1200 మెగావాట్ల సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం కేవలం ఆరు సంవత్సరాల కాలంలోనే అత్యద్భుతమైన పనితీరుతో 91 శాతం ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పీ ఎల్ ఎఫ్) తో దేశంలో నెంబర్ వన్ స్థానంలో నిలిచిందని, ఇది సింగరేణి పనితీరుకు నిదర్శనమ‌న్నారు. ఈ పనితీరును గుర్తించి మరో 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ ను కూడా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి సూచించారని, మరో రెండు నెలల్లో నిర్మాణపు పనులు ప్రారంభమ‌వుతాయన్నారు. ఈ సందర్భంగా సింగరేణి భవన్ లోని ఉత్తమ అధికారిగా ఎంపికైన సీనియర్ లా ఆఫీసర్ కొలిశెట్టి కౌశల్ ను, ఉద్యోగిగా ఎంపికైన సెక్యూరిటీ గార్డ్ సి రామకృష్ణను ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో అడ్వైజర్(మైనింగ్) డి.ఎన్.ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కోల్ మూమెంట్) జె.అల్విన్, జీఎం(కో ఆర్డినేషన్) ఎం.సురేశ్, జీఎం(మార్కెటింగ్) కె.సూర్యనారాయణ, అడ్వైజర్(లా) లక్ష్మణ్, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ ఎన్.భాస్కర్, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. అనంతరం కాన్ఫరెన్స్ హాల్ లో జరిగిన సమావేశంలో జనరల్ మేనేజర్ (కో ఆర్డినేషన్) ఎం సురేష్ మాట్లాడుతూ… సంస్థ ఛైర్మన్ అండ్ ఎండీ ఎన్.శ్రీధర్ దిశా నిర్దేశంలో సింగరేణి సంస్థ గత ఎనిమిది సంవత్సరాలుగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ సంక్షేమంలో కూడా దేశంలో నెంబర్ వన్ గా నిలిచిందని, ఇదే ఒరవడి కొనసాగించాలని కోరారు. ఈ సందర్భంగా సింగరేణి భవన్ ఉద్యోగులు పాడిన దేశ భక్తి గీతాలు అందరినీ అలరించాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement