Friday, March 29, 2024

బొగ్గు ఉత్పత్తిలో సింగరేణి రికార్డు.. 19 శాతం వృద్ధితో 67.3 లక్షల బొగ్గు ఉత్పత్తి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : బొగ్గు ఉత్పత్తిలో సింగరేణి సంస్థ డిసెంబర్‌ నెలలో రికార్డు సాధించింది. రోజుకు సగటున 2.18 లక్షల టన్నుల బొగ్గు రవాణాతో ఆల్‌టైమ్‌ రికార్డు సాధించింది. గత డిసెంబర్‌ కంటే.. 19 శాతం వృద్ధితో 67.3 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేశారు. ఇదే ఒరవడితో వార్షికాంతానికి 43 వేల కోట్ల టర్నోవర్‌, అత్యధిక లాభాల దిశగా సింగరేణి చరిత్రలోనే బొగ్గు ఉత్పత్తి, రవాణా చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సింగరేణి సీఎండీ శ్రీధర్‌ తెలిపారు. ఇవ్వాల (మంగళవారం) సింగరేణి భవన్‌లో సంస్థ డైరెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎండీ శ్రీధర్‌ సమీక్ష నిర్వహించారు. ఇకపై రోజుకు కనీసం 2.30 లక్షల టన్నులకు తగ్గకుండా బొగ్గు ఉత్పత్తి, రవాణా జరపాలని వివిధ ఏరియాల జీఎంలకు సీఎండీ సూచించారు. 2022 డిసెంబర్‌ నెలలో సింగరేణి సంస్థ తన చరిత్రలోనే అత్యధిక నెలవారి ఉత్పత్తిగా 67.3 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, 2.18 టన్నుల బొగ్గు రవాణా జరిపి రికార్డు సాధించిందన్నారు.

మిగిలిన మూడు నెలల్లో ఉత్పత్తిని మరింత పెంచాలని సూచించారు. గత 2021 డిసెంబర్‌లో 56.5 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించామని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సర డిసెంబర్‌లోనే 19 శాతం వృద్ధిని అధికంగా సాధించామన్నారు. గత డిసెంబర్‌లో 37.37 మిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల ఓవర్‌ బర్డెన్‌ను తొలగించగా, ఈ ఆర్థిక సంవత్సర డిసెంబర్‌లో 24.47 శాతం వృద్ధితో 47 మిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల ఓబీని తొలగించామని సీఎండీ శ్రీధర్‌ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన 3 నెలల కీలకమని తెలిపారు. మణుగూరు, కొత్తగూడెం, రామగుండం రీజియన్‌, ఆండ్రియా ప్రాజెక్టుల నుంచి గరిష్ట స్థాయిలో బొగ్గు ఉత్పత్తి, రవాణ జరపడంపై అభినందనీయమన్నారు.

మిగతా ఏరియాలు కూడా ఇదే విధంగా ముందుకెళ్ళాలని ఆయన సూచించారు. ఈ సమీక్షలో సింగరేణి డైరెక్టర్లు ఎస్‌. చంద్రశేఖర్‌, ఎన్‌. బలరాం, డి. సత్యనారాయణరావు, జె. అల్విన్‌, డీఎన్‌ ప్రసాద్‌, సురేంద్రపాండే, జీఎం సీఎచ్‌ నరసింహరావు, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement