అమరావతి, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం వినియోగదారులకు షాక్ ఇచ్చింది. ఎన్నికల ఏడాది కావడంతో మద్యం ధరలు తగ్గుతాయని ఆశించిన వారికి..ఏఈఆర్‌టీ(అదనపు ఎక్సైజు రిటైల్ టాక్స్) పేరిట మద్యం రేట్ల పెంపుతో నిరాశ మిగిల్చింది. ఇప్పటి వరకు రూపాయల్లో మాత్రమే ఉన్న ఏఈఆర్‌టీని శాతాల్లోకి మార్చింది. రూపాయల్లో ఏఈఆర్‌టీ ఉండటంతో పన్నుల విధింపుల్లో వ్యత్యాసాలు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది.
రాష్ట్రంలో వివిధ మద్యం బ్రాండ్లపై ఎమ్మార్పీ ఆధారంగా ఫిక్స్‌డ్ కాంపొనెంట్ రూపంలో ప్రస్తుతం విధిస్తున్న ఏఈఆర్‌టీ (అదనపు రిటైల్ ఎక్సైజు టాక్స్) సవరణ ద్వారా ఆయా బ్రాండ్ల ధరపై శాతాల రూపంలో వసూలు ఉంటుంది. ఇందులో భాగంగా వ్యాట్, ఏఈడీనీ కూడా ప్రభుత్వం సవరిస్తూ శుక్రవారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏఈఆర్‌టీని ప్రభుత్వం సవరించడంతో అన్ని రకాల మద్యం బ్రాండ్లపై ఒకే తరహాలో పన్నుల భారం పడనుంది.
క్రేజీ బ్రాండ్స్‌పై పెంపు..
రాష్ట్రంలో కొన్ని బ్రాండ్ల మద్యం అత్యధికంగా అమ్ముడవుతుంది. సాధారణంగా చీప్ లిక్కర్, మీడియం బ్రాండ్ల మద్యం అత్యధిక డిమాండ్ ఉంటుంది. రోజువారీ కూలీలు, సాధారణ, మధ్య తరగతి వర్గాలు వీటిని ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. ఈ క్రమంలో ప్రభుత్వం సవరించిన ఏఈఆర్‌టీతో కొన్ని బ్రాండ్ల మద్యం ధరలు క్వార్టర్(నిబ్)పై రూ.10 నుంచి రూ.40, హాఫ్ బాటిల్ రూ.10 నుంచి రూ.50, ఫుల్ బాటిల్ రూ.10 నుంచి రూ.90 వరకు పెరిగాయి. అధికంగా అమ్ముడుపోని, అందుబాటులో లేని బ్రాండ్ల ధరలు తగ్గాయి.
ప్రభుత్వం సవరించిన ఏఈఆర్‌టీ ప్రకారం..ఐఎంఎఫ్‌ఎల్ కనీస కేసు ధర రూ.2,500లోపు ఉంటే 250 శాతం, రూ.2,500 పైబడి ఉంటే 150 శాతం, బీరుపై 225 శాతం, వైన్‌పై 200 శాతం, ఫారిన్ లిక్కర్‌పై 75 శాతంగా నిర్థారించారు. ఒక బ్రాండ్ ఫుల్ బాటిల్ ప్రస్తుతం రూ.570 ఉంటే.. అది రూ.590కి పెరిగింది. మరో బ్రాండ్ క్వార్టర్ రూ.200 నుంచి రూ.210కి చేరింది. ఇదే సమయంలో కొన్ని రకాల బ్రాండ్ల మద్యం ధరలు క్వార్టర్ బాటిల్‌పై రూ.10 నుంచి రూ.20 వరకు తగ్గింది.
విదేశీ మద్యంపై కూడా..
రాష్ట్రంలో విదేశీ మద్యం సరఫరాదారులకు ఇచ్చే ధరను పెంచారు. గత పదేళ్లుగా వీటి ధరలు సమీక్షించలేదని ప్రభుత్వం పేర్కొంది. రోజు రోజుకూ పెరుగుతున్న రవాణా చార్జీలు, ఇతర ఖర్చుల నేపథ్యంలో ధరలు పెంచాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. విదేశీ మద్యం ధరల పెంపుపై ఇప్పటికే ప్రభుత్వం నియమించిన కమిటీ పలు సిఫారసులు చేసింది.
ఆ మేరకు సరఫరాదారులకు ఇచ్చే ధరను 20శాతం పెంచారు. కొత్తగా వచ్చే బ్రాండ్ల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సరఫరాదారులు నిర్ణయించిన ధర, లేదా పక్క రాష్ట్రాలకు అవే బ్రాండ్లు సరఫరా చేస్తున్న పక్షంలో రెండింటిలో ఏది తక్కువైతే దానిని పరిగణనలోకి తీసుకుని అనుమతులు ఇవ్వనుంది. విదేశీ మద్యం బ్రాండ్ల కొనుగోలు ధరలు పెంచటం వల్ల ఆయా బ్రాండ్ల ఎమ్మార్పీ రేట్లు కూడా పెరుగుతాయి.
సీఎం అన్నట్టే షాక్..
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి మద్యం రేట్లు షాక్ కొట్టేలా ఉండాలంటూ తరుచూ అధికారుల సమీక్షా సమావేశాల్లో చెపుతుంటారు. రేట్ల పెంపు ద్వారా మద్య వినియోగం తగ్గించాలనేదే ప్రభుత్వ విధానమని ఆయన స్పష్టం చేస్తుంటారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వినియోగం తగ్గించేందుకు మద్యం పాలసీలో పలు కీలక మార్పులు తీసుకొచ్చింది. వచ్చిన వెంటనే రాష్ట్రంలోని 43వేల బెల్టు షాపులు రద్దు చేశారు.
ఇదే క్రమంలో ప్రైవేటు నిర్వహణలోని మద్యం షాపులను ఏపీబీసీఎల్ పరిధిలోకి తీసుకొచ్చి షాపుల సంఖ్య తగ్గించారు. మరో వైపు మద్యం రేట్లను పెంచడంతో పాటు అమ్మకపు వేళలు కుదించారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో మద్య వినియోగం గణనీయంగా తగ్గిందని ప్రభుత్వ గణాంకాలు చెపుతున్నాయి. మరో ఆరు మాసాల్లో జరిగే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని మద్యం రేట్లు తగ్గుతాయని పలువురు ఆశించారు. అయితే వారి ఆశలపై నీళ్లు జల్లుతూ సీఎం చెప్పినట్లుగానే రేట్లు పెంచడం ద్వార పెద్ద షాక్ ఇచ్చినట్లు చెప్పొచ్చు.