Thursday, April 25, 2024

పర్యాటకులను ఆకట్టుకుంటున్న సిద్దిపేట కోమటి చెరువు.. ప్రత్యేక ఆకర్షణగా స్కై సైకిలింగ్‌, సస్పెన్షన్‌ బ్రిడ్జి

హైదరాబాద్‌,ఆంధ్రప్రభ: గ్రామీణ ప్రకృతి దృశ్యంపై పట్టణీకరణ ప్రభావం పడుతుంది. పల్లెల్లోని చరిత్రాత్మక వారసత్వ సంపద చూసేందుకు పట్టణప్రజలు ఆసక్తి చూపడంతో అనేక పల్లెలు పర్యాటక ప్రాంతాలుగా విరాజిల్లుతున్నాయి. పర్యాటక రంగాభివృద్ధి తో ఉపాధి, విదేశీ మారకద్రవ్యం లభిస్తుండటంతో రాష్ట్రంలో చారిత్రిక ప్రదేశాలు పర్యాటక ప్రాంతాలుగా మస్తాబు అవుతున్నాయి. ఇందులో భాగంగా సిద్దిపేట నియోజకవర్గంలోని కోమటిచెరువు, చారిత్రిక ప్రదేశాలు చూసేందుకు సుదూరప్రాంతాలనుంచి ఇక్కడికి వచ్చి చెరువు అందాలకు ఆకర్షితులవుతున్నారు. హైదరాబాద్‌ నుంచి కోమటి చెరువుకు ప్రత్యేకంగా ట్రాన్స్‌ పోర్టు ఉండటమే ఆ చెరువు ప్రాధాన్యతకు దర్పణం పడుతుంది.

- Advertisement -

ఇటీవల చరిత్రపరిశోధకులు సిద్దిపేట జిల్లాచరిత్రలో కొత్తకోణాలను ఆవిష్కరించారు. ఈ ప్రాంతానికి వేలాది సంవత్సరాల చరిత్ర ఉన్నట్లు ఆధారాలతో నిరూపించడంతో కోమటి చెరువు ప్రాధాన్యతకు మరింత వన్నెవచ్చింది. మాతంగి వాగు ఒ్డడున ఆవిర్భవించిన జనవాసాలు క్రమేణ సిద్దిపేటగా గుర్తుంపులోకి వచ్చింది. నిజాంపాలనలో సిద్దిఖ్‌ ఇక్కడి పాలకుడిగా ఉండటంతో సిద్దిపేటపేరువచ్చినట్లు చరిత్రకారులు భావిస్తున్నప్పటికీ తెలంగాణ చరిత్రకారులకు సిద్దిపేటలోని పొరుపల్లి వీధి భోగేశ్వర ఆలయం దగ్గర వీరగల్లుల విగ్రహాలు, మామిడోళ్ల బావిదగ్గర శాతవాహనుల కాలంనాటి పనిముట్లు దొరకడంతో ఇక్కడ వేలఏళ్లకిందటే సంస్కృతి విరాజిల్లినట్లు తెలుస్తుంది. అక్కడి జలవాసాల దగ్గర జనవాసాలు ఉండేవని భావిస్తున్నారు. ఈప్రాంతంలో ఉన్న కోమటి చెరువు కాలగర్భంలో కలిసిపోతుంటే తెలంగాణ రాష్ట్రం అవతరించిన అనంతరం చెరువును సుందరీకరించడంతో పాటుగా గొప్పపర్యాటక ప్రాంతంగా ప్రభుత్వం తీర్చిదిద్దింది.

కోమటి చెరువు చుట్టూ నక్లెస్‌ రోడ్డు, రాక్‌ గార్డెన్‌, నైట్‌ గార్డెన్‌, గేమ్‌ జోన్‌, బోటింగ్‌, లేజర్‌ షో, అడ్వెంచర్‌ పార్క్‌, చిల్డ్రన్స్‌ పార్క్‌, కేబుల్‌ బ్రిడ్జి ఏర్పాటు చేయడంతో చెరువు అందాలను తిలకించేందుకు పర్యాటకులు ఆరాటపడుతున్నారు. హైదరాబాద్‌ నుంచి కేవలం 102 కి.మీ. ఉండటంతో సెలవుల్లో సేదతీరేందుకు కోమటి చెరువును వేదికగా చేసుకుంటున్నారు. ఇక్కడ ప్రధానంగా నైట్‌ గార్డెన్‌ పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటుంది. అలాగే స్పీడ్‌ బోటింగ్‌, స్కైసైకిలింగ్‌ కోమటి చెరువు అందాలను ద్విగుణీకృతం చేస్తున్నాయి. కొలంబోస్‌ రంగుల రాట్నం చెరువుకు మరింత వన్నెతెచ్చింది. అలాగే లగ్జరీ బోట్‌, స్పీడ్‌ బోట్‌, వాటర్‌ గేమ్స్‌ తో పర్యాటకులు సహసాలుకూడా చేస్తున్నారు. బ్రిడ్జి మెన్‌ గా గుర్తించబడిన పద్మశ్రీ గిరీష్‌ నిర్మించిన సస్పెన్షన్‌ వంతెనను పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటుంది. కొరియా నుంచి దిగుమతి అయిన గాల్వనైజ్డ్‌ తాళ్లతో నిర్మించిన ఈ వంతెెన 100మీటర్ల ఎత్తు,241 మీటర్ల పొడవు 4 అడుగుల వెడల్పుతో ఆకట్టుకుంటుంది. తెలంగాణ ఉద్యమానికి వేదికైన సిద్దిపేట అభివృద్ధిలో దూసుకుపోవడమేకాకుండా పర్యాటకులను ఆకట్టుకునే విధంగా తీర్చి దిద్దిన కోమటి చెరువు సిద్దిపేట అందాలను చాటిచెప్పే పర్యాటక కేంద్రంగా భాసిల్లడం ప్రశంసనీయం.

Advertisement

తాజా వార్తలు

Advertisement