Thursday, March 28, 2024

ఓపెనింగ్ కు సిద్ధంగా సిద్దిపేట ఐటీ హబ్ : మంత్రి హరీశ్ రావు

సిద్దిపేట, 9 జూన్ (ప్ర‌భ న్యూస్) : నియోజకవర్గ స్థాయి యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా కేసీఆర్ సర్కారు సిద్దిపేటలో ఐటీ హబ్ ఏర్పాటు చేసిందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట శివారులో నిర్మిస్తున్న ఐటీ హబ్ ను శుక్రవారం ఉదయం ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, టీఎస్ఐఐసీ జోనల్ మేనేజర్ మాధవిలతో కలిసి ఐటీ టవర్ లోని ప్రతీ ఫ్లోర్ కలియ తిరుగుతూ సందర్శించి జిల్లా కలెక్టర్, టీఏస్ఐఐసీ అధికారులతో ప్రారంభోత్సవ ఏర్పాట్లపై మంత్రి సమీక్ష జరిపారు. అత్యాధునిక సదుపాయాలతో నిర్మిస్తున్న ఐటీ హబ్ భవనాన్ని ఈ నెల జూన్ 15వ తేదీన రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నట్లు మంత్రి వెల్లడించారు. దీంతో ప్రత్యక్షంగా 750 మంది స్థానిక యువతకు, పరోక్షంగా మరికొంత మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. ఈ జూన్ నెల 13వ తేదీన సిద్ధిపేట పోలీసు కన్వెన్షన్ హాల్ లో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. ఈ మెగా జాబ్ మేళాలో 11 కంపెనీలు ఉద్యోగ అవకాశాలు ఇవ్వనున్నాయని, ఈ సదవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సిద్ధిపేట ఐటీ హబ్ లో 150 మందికి నిరంతర శిక్షణ..
సిద్ధిపేట ఐటీ హబ్ లో టాస్క్ ఆధ్వర్యంలో ప్రతీ బ్యాచ్ లో 150 మంది నిరుద్యోగ యువతకు శిక్షణ తరగతులు నిర్వహిస్తారని, ప్రతీ 45 రోజులకు ఒక బ్యాచ్ ఉంటుందని మంత్రి పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement