Tuesday, April 23, 2024

కెనడా పరిశ్రమల్లో మానవ వనరుల కొరత.. 10 లక్షలకు పైగా ఉద్యోగ ఖాళీలు

తమ దేశంలో ఉద్యోగాలు చేయాలనుకుంటున్నవారికి కెనడా పెద్దపీట వేయనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అక్కడి పరిశ్రమలు, వివిధ సంస్థల్లో ఉద్యోగుల కొరత వేధిస్తోంది. వృత్తి నిపుణులు, శాస్త్ర, సాంకేతిక రంగాలు, రవాణా, వేర్‌హౌసింగ్‌, ఫైనాన్సింగ్‌, జీవితభీమా, వినోదం, రియల్‌ ఎస్టేట్‌ రంగాల్లో ఖాళీల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. కార్మిక శక్తి లోపించి పరిశ్రమల రంగం చతికిల పడుతోంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కనీసం 10 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాల్సి వస్తుందని అంచనా. అక్కడ వృత్తినిపుణులైన ఉద్యోగార్థులు లభించక విదేశాలనుంచి వచ్చేవారికి కోసం ఎదురు చూస్తోంది. 2021 మే తరువాత ఉద్యోగుల కొరత భారీగా పెరిగింది. ఈ ఒక్క సంవత్సరంలోనే దాదాపు 3 లక్షల ఖాళీలు ఏర్పడ్డాయి. కెనడాలో మంచి ఉద్యోగాలకు అవకాశాలు వస్తూండటంతో భారతీయ వృత్తి నిపుణులు, కార్మికులు అక్కడ అవకాశాలు పొందేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ద లేబర్‌ ఫోర్స్‌ సర్వే ఫర్‌ మే 2022లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఆ దేశంలోని సంస్థలు, పరిశ్రమల్లో పనిచేసే ఉద్యోగుల్లో ఎక్కువమంది వయోభారం కారణంగా పదవీ విరమణ చేస్తున్నారు. అలాగే చిన్నపిల్లలున్నవారు పిల్లల పెంపకానికి ప్రాధాన్యం ఇస్తూ ఉద్యోగాలు మానేస్తున్నారు. 55 ఏళ్లు పైబడినవారు ఇంటిపట్టున ఉండాలని భావిస్తూ ఉద్యోగాలకు స్వస్థి చెబుతున్నారు. దాంతో పెద్దఎత్తున ఖాళీలు ఏర్పడుతున్నాయి. వచ్చే పదేళ్లలోకనీసం 90 లక్షలమంది ఉద్యోగాలు వీడే అవకాశాలున్నట్లు అంచనా.

విదేశాలవైపు కెనడా చూపు..

దేశంలో ఉద్యోగ ఖాళీల సంఖ్య భారీగా పెరగడంతో భర్తీ చేయడంపై కెనడా ప్రభుత్వం దృష్టి సారించింది. దేశీయంగా నిపుణులు, మానవ వనరుల కొరత కారణంగా విదేశాలవైపు చూస్తోంది. భారీ ప్యాకేజీలు, పర్మినెంట్‌ రెసిడెంట్‌ వీసాల ఆశ చూపి ఉద్యోగార్థులను ఆహ్వానించేందుకు రంగం సిద్దం చేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 4.3 లక్షలమందికి పర్మినెంట్‌ రెసిడెంట్‌ వీసాలు మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2024 నాటికి 4.5 లక్షల మందికి అవకాశం కల్పించాలని భావిస్తోంది. ఈ పరిస్థితుల్లో భారతీయ ఉద్యోగార్థులు కెనడావైపు ఆశగా చూస్తున్నారు. ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉండటం, భర్తీ ప్రక్రియకు శ్రీకారం చుట్టడం, మంచి జీతాలు, నిరుద్యోగిత తక్కువగా ఉండటంతో వీరంతా కెనడా వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. అమెరికా, ఆస్ట్రేలియాలాంటి దేశాలతో పోలిస్తే కెనడాలో వీసా మంజూరు ప్రక్రియ, ఉద్యోగావకాశాలు ఎక్కువ. విదేశాలనుంచి ఉద్యోగాల కోసం వృత్తి నిపుణులకు అక్కడి ప్రభుత్వం అనేక సౌకర్యాలు కల్పిస్తోంది. సాధారణంగా కెనడా వెళ్లేందుకు కాస్త సమయం ఎక్కువే పడుతుంది. కానీ ఇప్పుడు ఉద్యోగాల కోసం ఆహ్వానం పలికినప్పుడు దరఖాస్తు చేసుకుని అవకాశం దక్కించుకుంటే, పర్మినెంట్‌ రెసిడెంట్‌ వీసా ద్వారా తక్షణం కెనడా వెళ్లేందుకు చాన్స్‌ వస్తుంది.

ఆ దేశాల్లోనూ ఉద్యోగావకాశాలు..

కోవిడ్‌ ప్రభావం తగ్గిన తరువాత ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలు పుంజుకుంటున్నాయి. ఫలితంగా పరిశ్రమలు, వివిధ సంస్థల కార్యకలాపాలు పెరిగాయి. దాంతో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగం పుంజుకుంది. ఈ పరిణామం ఒక్క కెనడాకే పరిమితం కాలేదు. గతంలో ఎన్నడూలేని విధంగా ఇప్పుడు కొన్నిదేశాల్లో ఉద్యోగావకాశాలు వస్తున్నాయి. అల్బెర్టా అండ్‌ ఒంటారియా దేశంలో భర్తీ చేయాల్సిన ఒక్కో ఉద్యోగానికి కేవలం 1.1 సంఖ్యలో మాత్రమే ఉద్యోగార్థులు పోటీపడుతున్నారు. మార్చిలో అయితే ఇది 1.2 రెండుగా ఉండగా గతేడాది ఇదే సమయంలో 2.4 గా ఉంది. అంటే, ఖాళీ ఉద్యోగాల సంఖ్య పెరగడం, ఉద్యోగార్థుల సంఖ్య తగ్గినట్లు మరో సర్వేలో తేలింది. నిర్మాణ రంగంలో ఏప్రిల్‌లో రికార్డు స్థాయిలో 89వేల ఖాళీలు,ఆహార రంగంలో మేలో1.61 లక్షల ఖాళీలు ఏర్పడ్డాయి.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement