Thursday, April 25, 2024

వైద్య,ఆరోగ్య శాఖలో డైటీషియన్ల కొరత.. ప్రధాన ఆసుపత్రుల్లో భారీగా ఖాళీలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో డైటీషియన్ల కొరతతో దీర్ఘకాలిక రోగులు ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కొత్త, పాత మెడికల్‌ కళాశాలల్లో కలిపి మొత్తం 30 డైటీషియన్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసుపత్రులలో రోగులకు ఇచ్చే ఆహారంలో నాణ్యతను పరిశీలించడం, రోగి పరిస్థితిని బట్టి ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఎన్ని క్యాలరీలు ఉండాలి? వాటిని ఏ విధంగా సమపాళ్లలో తీసుకోవాలి వంటి సలహాలు చార్ట్‌ రూపంలో ఇవ్వడం డైటీషియన్ల ప్రధాన విధి. వీరి సూచనలు, సలహాల ప్రకారమే ఆసుపత్రులలో రోగులకు డైట్‌ అందజేస్తుంటారు. ఇలాంటి ప్రధానమైన డైటీషియన్ల పోస్టులలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ న్యూట్రీషన్‌ స్పెషలైజేషన్‌ లేదా పిజి డిప్లొమా ఇన్‌ న్యూట్రీషన్‌ కోర్సు ఉత్తీర్ణత సాధించిన వారిని వైద్య,ఆరోగ్య శాఖ నియమిస్తుంది. గతంలో డైటీషియన్‌ పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం జీవో నం.2035 ద్వారా నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

అయితే, ఈ కోర్సు ఉత్తీర్ణత సాధించిన ఎవరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోకపోవడంతో ఆ జీవోకు సవరణ చేసి డిగ్రీతో పాటు అప్లైడ్‌ న్యూట్రీషన్‌ అభ్యసించిన హెడ్‌ నర్సులు కూడా అర్హులని ప్రకటించింది. ఈ పోస్టులు గెజిటెడ్‌ కేటగిరీలోకి రావడం వల్ల వైద్య శాఖలో అర్హులతో పాటు అనర్హులు కూడా దరఖాస్తు చేసుకున్నారు. ఇతర రాష్ట్రాలలోని పలు విశ్వవిద్యాలయాల నుంచి ఈ కోర్సు పూర్తి చేసినట్లు కొందరు అభ్యర్థులు నకిలీ సర్టిఫికెట్లతో దరఖాస్తు చేసినట్లు వెల్లడి కావడంతో ఈ పోస్టుల భర్తీ ప్రక్రియను వైద్య,ఆరోగ్య శాఖ నిలిపివేసింది. అయితే, అన్ని రకాల అర్హత ఉన్న వారు సైతం ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ అనర్హులతో పాటుగా వీరిని కూడా పక్కనబెట్టారు. ఇదిలా ఉండగా, ప్రతీ బోధనాసుపత్రిలో ఒక చీఫ్‌ డైటీషియన్‌, మరో డైటీషియన్‌ కచ్చితంగా ఉండాలి.

- Advertisement -

అయితే, ప్రభుత్వం ఈ పోస్టుల నియామక ప్రక్రియను నిలిపివేయడంతో రాష్ట్ర్రవ్యాప్తంగా ప్రధాన ఆసుపత్రులలో 30 వరకు డైటీషియన్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కాగా, డైటీషియన్ల పోస్టులు ఖాళీగా ఉండటంతో ఆసుపత్రులలో రోగులకు సరఫరా చేసే ఆహారంలో నాణ్యతలో లోపాలు తలెత్తే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రోగులకు ఆహారం సరఫరా చేసే కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థ ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం కాకుండా తమకు ఇష్టం వచ్చిన ఆహార పదార్థాలను సరఫరా చేసే అవకాశం ఉందనీ, దీంతో రోగులకు నాణ్యమైన ఉచిత ఆహారం సరఫరా చేయాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఖాళీగా ఉన్న డైటీషియన్ల పోస్టులను భర్తీ చేయాలనీ, ఈ దిశగా డీఎంఈ చొరవ తీసుకోవాలని కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement