Wednesday, April 24, 2024

డేటా సైన్స్‌ నిపుణు కొరత.. ఏఐకి పెరుగుతున్న డిమాండ్‌

హైదరాబాద్‌ : టెక్నాలజీ రంగంలో క్రమంగా అన్ని కంపెనీలు, పరిశ్రమలు డేటా విశ్లేషణకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఉత్పత్తి, మార్కెటింగ్‌ రంగాల్లో డేటానే అత్యంత కీలకం. సరైన మార్కెటింగ్‌ నిర్ణయాల కోసం ఆర్టిఫిషియన్‌ ఇంటిలిజెన్స్‌తో పాటు, డేటా సైన్స్‌కు ప్రాధాన్యత ఇస్తున్నాయి. దీంతో టెక్నాలజీ రంగంలో డేటా విశ్లేషకులకు, ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ (ఏఐ) నిపుణులకు మంచి డిమాండ్‌ ఏర్పడింది. ప్రస్తుతం అన్ని ఐటీ కంపెనీలు ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌తో డేటాను విశ్లేషిస్తున్నాయి. వీటి ఆధారంగానే అనేక కొత్త ఉత్పత్తులను మార్కెట్‌ చేస్తున్నారు. గూగుల్‌ రూపొందించిన జీపీటీ చాట్‌బోట్‌ కూడా ఏఐ ఆధారితంగానే పని చేస్తోంది. అందుకే ప్రస్తుతం డేటా, ఏఐ నిపుణుల అవసరం ఎక్కువగా ఉంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఈ రెండు విభాగాల్లోనూ నిపుణుల కొరత ఎక్కువగా ఉంది.

మన దేశంలో కృత్రమ మేథ (ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌-ఏఐ) మార్కెట్‌ 2021లో 370 కోట్ల డాలర్లుగా ఉంది. 2025 నాటికి 780 కోట్ల డాలర్లు అంటే సుమారు 63 వేల కోట్ల డాలర్లకు చేరుతుందని అంచనా. రానున్న 5 సంవత్సరాల్లో ఇది ఏటా 20 శాతం వృద్ధి చెందుతుందని సాఫ్ట్‌వేర్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. డిజిటల్‌ నైపుణ్యాలకు పరిశ్రమలు, కంపెనీల నుంచి డిమాండ్‌ పెరగడంతో గత 3-5 సంవత్సరాల్లోనే డిజిటల్‌ టెక్నాలజీలో ప్రధానంగా ఏఐ, ఎంఎల్‌, డేటా సైన్స్‌, బిగ్‌ డేటా అనలిటిక్స్‌ వంటి విభాగాల్లో నిపుణుల డిమాండ్‌ రెట్టింపు అయ్యింది. 2026 నాటికి మన దేశంలోనే డేటా సైన్స్‌, ఏఐ నిపుణులు 10 లక్షల మందికి అవసరం అవుతారని అంచనా వేస్తున్నారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టెక్నాలజీ కంపెనీల్లో వీరి అవసరం ఎన్నో రేట్లు పెరగనుంది. ప్రస్తుతం మన దేశంలో 6,30,000 మంది డేటా సైన్స్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ నిపుణుల అవసరం ఉంటే, కేలవం 4,16,000 మంది మాత్రమే అందుబాటులో ఉన్నారు. డిమాండ్‌కు సరఫరాకు మధ్య దాదాపు 51 శాతం అంతరం ఉంది.

- Advertisement -

ప్రస్తుతం డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ వేగంగా జరుగుతోంది. ఇందులో కృత్రిమ మేథ ప్రధాన టెక్నాలజీగా మారింది. ప్రధానంగా డేటా సైన్స్‌లో డేటా అనలిస్ట్‌, డేటా మేనేజ్‌మెంట్‌ కన్సల్టెంట్‌, డేటా వేర్‌హౌస్‌ ఇంజినీర్‌, మెషిన్‌ టెర్నింగ్‌ సైంటిస్ట్‌ వంటి ఉద్యోగాలు ఉన్నాయి. హైదరాబాద్‌లో 50 వేల మంది, బెంగళూర్‌లో 69 వేల వరకు డేటా సైన్స్‌, ఏఐ నిపుణులు పని చేస్తున్నారని అంచనా. భవిష్యత్‌ అవసరాల కోసం ప్రస్తుతం ఉన్న నిపుణుల నైపుణ్యాలను పెంచేందుకు ఐటీ కంపెనీలు కృషి చేస్తున్నాయి. కీలకమైన రంగాల్లో నైపుణ్యం ఉన్న వారిని బయట నుంచి తీసుకోవడం కంపెనీలకు పెద్ద సవాల్‌గా ఉంది. అందుకే చాలా కంపెనీలు అంతర్గతంగానే ఉన్న వారికి గుర్తించి అవసరమైన వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాయి. డేటా సైన్స్‌, ఏఐ జాబ్స్‌లో 5 సంవ త్సరాలకు పైగా అనుభవం ఉన్న వారికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.

కొన్ని సంస్థలు హైదరాబాద్‌లో ప్రత్యేకంగా డేటా సైన్స్‌తో శిక్షణ ఇస్తూ వారికి ప్లేస్‌మెంట్‌ కూడా చూపిస్తున్నాయి. డేటా సైన్స్‌కు, ఏఐకి డిమాండ్‌ పెరగడంతో అమెరికాలోనూ కొన్ని యూనివర్శిటీలు ఎంఎస్‌తో డిగ్రీతో పాటు అదనంగా డేటా సైన్స్‌లోనూ శిక్షణ ఇస్తున్నాయి. ఇలాంటి వారికి ప్లేస్‌మెంట్‌లోనూ అధిక ప్రాధాన్యత దక్కుతుందని ఈ రంగంలోని నిపుణులు చెబుతున్నారు. ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌తో డిగ్రీ పూర్తి చేసిన విద్యార్ధులు డేటా సైన్స్‌లో శిక్షణ తీసుకుంటే మారికి మంచి వేతనాలతో ఉద్యోగం వస్తుందని ఈ రంగంలో నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement