Thursday, March 28, 2024

వణికిస్తున్న చలి.. వేగంగా పడిపోతున్న టెంప‌రేచ‌ర్లు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: తెలంగాణ‌పై చలి పంజా విసురుతోంది. శీతాకాలం ప్రారంభంలోనే వణుకుపుట్టిస్తోంది. రాబోయే రోజుల్లో చలి మరింత పెరగనుందని వాతావరణశాఖ చెబుతోంది. చలి పెరగడంతో ఉదయం 8, 9 గంటల వరకు ఇంటి నుంచి జ‌నాలు బయటకు రావడం లేదు. రాత్రిపూట యువకులు ఆయా ప్రాంతాల్లో మంట కాచుకుంటున్నారు. అక్టోబరు 20వ తేదీ నుంచి తెలంగాణలో ఉష్ణోగ్రతలు రోజు రోజుకూ తీవ్రంగా పడిపోతున్నాయి. ఉదయం వేళల్లో రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో పొగ మంచు కమ్ముకుంటోంది. సాయంత్రం 6 గంటలు కాకముందే చలి పెరుగుతోంది.

తూర్పు, ఈశాన్య భారత ప్రాంతాల నుంచి తెలంగాణలోకి తక్కువ ఎత్తులో శీతల గాలులు వీస్తున్నాయని, వీటి ప్రభావంతో రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగిందని వాతావరణశాఖ పేర్కొంది. రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. రాబోయే రెండురోజులపాటు చలిగాలులు కొనసాగుతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న 24 గంటల్లో రాష్ట్రంలో 30 డిగ్రీల గరిష్ణ ఉష్ణోగ్రత, 16 డిగ్రీ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో ఆదిలాబాద్‌లో 15.2, హైదరాబాద్‌లో 14.9, హన్మకొండలో 17.5, ఖమ్మంలో 19.6 డిగ్రీల రాత్రి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నవంబరు 1, 2, 3 తేదీల్లో తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాముందని వాతావరణ కేంద్రం తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement