Saturday, December 7, 2024

పోలీసుల‌కు అంతు చిక్క‌ని శిల్పా కేసు.. మ‌రో కోణంలో విచార‌ణ..

వ్యాపారాలలో పెట్టు బడులు, అధిక వడ్డీఆశ చూపించి సంపన్న కుటుంబాలకు చెందిన మహిళల నుంచి అందినంత దండుకుని ప్రస్తుతం కటకటాలను లెక్కిస్తున్న శిల్పా చౌదరి కేసులో చిక్కుముడిని విప్పేందుకు పోలీసులు విచారణను వేగ వంతంచేశారు. మూడు దఫాలు పోలీసు కస్టడీకి తీసుకుని విచారించినప్పటికీ శిల్పా చౌదరి అప్పుగా తీసుకున్న డబ్బులను ఏం చేశారు, ఎక్కడ దాచారన్నది వెల్లడించకపోవడంతో దర్యాప్తు కొలిక్కి వచ్చేందుకు వీలు లేకుండా పోయింది. బ్యాంక్‌ లాకర్లతో పాటు ఇంట్లోనూ పోలీసులు సోదా చేసినా ఆశించిన సమాచారాన్ని సేకరించలేకపోయారు. దీంతో ఏం చేయాలి, దర్యాప్తును ఎలా ముందుకు తీసుకు వెళ్ళాలన్న అంశంపై ఆదారాలు వెదుకుతున్నారు.

అప్పుగా తీసుకున్న డబ్బులను వేర్వేరు వ్యక్తులకు ఇచ్చానని శిల్పా చౌదరి చెప్పినప్పటికీ అందుకు సంబంధించిన ఆధారాలేవీ చూపించలేకపోయింది. పెట్టుబడుల కోసం డబ్బులు ఇచ్చానని శిల్పా చౌదరి చెప్పిన వారిని పోలీసులు ప్రశ్నిస్తే తమతో ఎలాంటి ఆర్థిక లావాదేవీలను జరపలేదని తేల్చి చెప్పడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో పోలీసులున్నారు. పైగా బ్యాంక్‌ ఖాతాలను పరిశీలిస్తే ఎప్పుడూ లక్షల రూపాయల లావాదేవీలను జరపలేదని తేలింది. దీంతో శిల్పా చౌదరి కస్టడీ విచారణలో చెప్పింది అంతా విచారణాధికారులను బురిడీ కొట్టించేందుకేనని గుర్తించిన పోలీసులు దర్యాప్తును మరో కోణంలో ముందుకు తీసుకు వెళ్ళాలని భావిస్తున్నారు.

శిల్పా చౌదరి దంపతుల ఫోన్‌ కాల్‌ డేటాను విశ్లేషిస్తే దర్యాప్తులో కొంత పురోగతి సాధించవచ్చనుకుంటున్న పోలీసులు ఆ కోణంలో ముందుకు వెళ్తున్నారు. శిల్పా చౌదరి తరచూ ఎవరితో ఫోన్‌లో మాట్లాడింది, ఎంతెంత సేపు మాట్లాడిందన్న వివరాలను తెలుసుకునే పనిని చేపట్టారు. ఇందుకోసం ఐటీ నిపుణుల సహాయంతో పాటు టెలికాం ఆపరేటర్ల సహాయాన్ని కూడా కోరారు. శిల్పా చౌదరి కిట్టీ పార్టీలకు వచ్చిన వారి వివరాలను పోలీసులు ఇప్పటికే సేకరిం చారు. వారితో పాటు శిల్పా చౌదరితో పరిచయం ఉన్న వారి వివరాలను కూడా రాబట్టారు. వీరితో పాటు ఇంకెవరి తోనైనా శిల్పా చౌదరి మాట్లాడిందా అన్న విషయాలు తెలిస్తే వారి నుంచి కొంత సమాచారాన్ని తెలుసుకోవచ్చని పోలీసులు అంటున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement