Friday, April 19, 2024

సాగునీటిరంగంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం.. ఎస్‌జడ్‌సీ ఎదుట రాష్ట్రం ఆవేదన

  • కృష్ణా, గోదావరి జలాల్లో న్యాయమైన వాటా కోసం డిమాండ్‌
  • కర్ణాటక అక్రమ ప్రాజెక్టులను ఆపాలని అభ్యర్థన
  • అక్రమంగా ఏపీ చేస్తున్న గోదావరి, కృష్ణా జలాల మళ్లింపును ఆపాలని విన్నపం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: సాగునీటిపారుదల ప్రాజిెక్టుల విషయంలో కేంద్రం చూపుతున్న నిర్లక్ష్యం, పొరుగు రాష్ట్రాలు కర్ణాటక, ఏపీ నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న ప్రాజెక్టులపై దక్షిణాది రాష్ట్రాల జోనల్‌ కౌన్సిల్‌ స్టాండింగ్‌ కమిటీ (ఎస్‌జడ్‌సీ) ఎదుట తెలంగాణ రాష్ట్రం ప్రస్తావనకు తెచ్చింది. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా నదిలో న్యాయమైన నీటి కేటాయింపుల కోసం సెక్షన్‌-3 ప్రకారం కొత్త ట్రిబ్యునల్‌ను వేయాలని కోరింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటై 8 ఏళ్లు గడుస్తున్నా కొత్త ట్రిబ్యునల్‌ వేయకపోవటం, ఉన్న ట్రిబ్యునల్‌కు నదీ జలాల పంపిణీ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం విన్నవించకపోవటంతో తెలంగాణ ప్రాంత ఆయకట్టు రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని పేర్కొంది. ప్రత్యేకించి కృష్ణా బేసిన్‌లో తెలంగాణ ఆయకట్టు ప్రాంతం ఎక్కువగా ఉన్నందున నదీ జలాలను ఏపీ, తెలంగాణ మధ్య 50:50శాతం పంచాలని జోనల్‌ కమిటీ సమావేశానికి తేల్చి చెప్పింది. ఇప్పుడున్న 66:34 శాతం మేర కృష్ణా జలాల పంపిణీతో తీవ్ర అన్యాయం జరుగుతోందని స్పష్టం చేసింది. ట్రిబ్యునళ్ల కేటాయింపులు లేకున్నా పొరుగున్న ఉన్న మరో రాష్ట్రం కర్ణాటక .. అప్పర్‌ భద్ర, అప్పర్‌ తుంగ పేరుతో తుంగభద్రపై ప్రాజెక్టులు నిర్మిస్తోందని ఫిర్యాదు చేసింది.

ఈ ప్రాజెక్టులు పూర్తయితే కృష్ణలో ప్రవాహం ప్రమాదకరస్థాయిలో పడిపోతుందని, దాంతో కృష్ణాబేసిన్‌లోని తెలంగాణ ప్రాంతానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని, పాలమూరు ప్రాంతం ఎడారిగా మారే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేసింది. గోదావరిపై తెలంగాణకు కేటాయించిన జలాలను వినియోగించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఆరు ప్రాజెక్టుల డీపీఆర్‌లకు వెంటనే ఆమోదం తెలిపేలా కేంద్ర జలశక్తి శాఖకు సమస్యను విన్నవించాలని ఎస్‌జడ్‌సీని అభ్యర్థించింది. ఏపీ ప్రభుత్వం నిర్మిస్తోన్న పోలవరం ప్రాజెక్టు బ్యాక్‌ వాటర్‌లో తెలంగాణలోని పలు గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని, వెంటనే ఆ ప్రమాదాన్ని తప్పించేందుకు పోలవరం డిజైన్‌ను మార్చాలని ప్రతిపాదించింది. గోదావరి, కృష్ణా జలాలను నిబంధనలకు విరుద్ధంగా పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టుల ద్వారా ఏపీ కృష్ణా డెల్టాకు జలాలను తరలిస్తోందని ఆరోపించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement