Saturday, April 20, 2024

ప్ర‌శాంతంగా కొనసాగుతున్న‌ ఎపిలో రెండో విడ‌త పోలింగ్ …

అమ‌రావ‌తి – రెండో విడత ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఉదయం 6.30 గంటలకు ప్రారంభ‌మైంది.. పోలింగ్‌ ప్రారంభమై సాయంత్రం 3.30గంటల వరకు కొనసాగనుంది. న‌క్స‌ల్ ప్రాంతాల‌లో మ‌ధ్యాహ్నం 1.30 కే పోలింగ్ ముగియ‌నుంది. రెండో విడతలో 3,328 గ్రామ పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్లు జారీ కాగా 539 చోట్ల సర్పంచి పదవులు ఏకగ్రీవమైన విషయం తెలిసిందే. నెల్లూరు, కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లోని ఒక్కో గ్రామ పంచాయతీలలో సర్పంచి పదవులకు నామినేషన్లు దాఖలు కాకపోవడంతో మిగిలిన 2,786 చోట్ల సర్పంచి పదవులకు పోలింగ్ కొన‌సాగుతున్న‌ది..
రెండో విడత గ్రామాల్లో మొత్తంగా 2,786 గ్రామ పంచాయతీ సర్పంచి స్థానాలకు గానూ 7,507 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 33,570 వార్డులకు గానూ 12,604 ఏకగ్రీవమయ్యాయి. మరో 149 వార్డులలో నామినేషన్లు దాఖలు కాకపోవడంతో మిగిలిన 20,817 వార్డులకు పోలింగ్‌ జరుగుతున్న‌ది. ఇందుకోసం 44,876 మంది అభ్యర్ధులు పోటీలో నిలిచారు. కాగా రెండో విడ‌త పోలింగ్ లో స్వ‌ల్ప సంఘ‌ట‌న‌లు మిన‌హా ప్రశాంతంగానే కొన‌సాగుతున్న‌ది.. పోలింగ్ ప్రారంభ‌మైన అయిదు గంట‌ల‌లోనే చాలా ప్రాంతాల‌లో 45 శాతం పోలింగ్ జ‌రిగింది.
నిమ్మకూరులో స్వల్ప ఉద్రిక్తత
కృష్ణా జిల్లా కొత్త నిమ్మకూరులో టీడీపీ-వైసీపీ వర్గాల మధ్య స్వల్వ ఉద్రిక్తత చోటుచేసుకుంది. వృద్ధురాలితో బూత్‌లోకి వెళ్లి ఓటు వేసే ప్రయత్నం చేయగా, టీడీపీ నేతను వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు అడ్డకున్నారు. ఇర్గువర్గాల మధ్య తోపులాట జరగడంతో.. పోలీసులు చెదరగొట్టారు.
మాజీ ఎమ్మెల్యే జి.వి.ఆంజనేయులు స్వగ్రామంలో ఘర్షణ
గుంటూరు జిల్లా ఈపూరు మండలం ఇనిమెళ్లలో ఘర్షణ చోటు చేసుకుంది. 7వ వార్డు పోలింగ్ బూత్‌లో ప్రజల నుంచి ఓటరు స్లిప్‌లు లాక్కొని తానే ఓట్లు వేసేందుకు ఓ ఏజెంట్ ప్రయత్నించాడు. అయితే, మరో అభ్యర్థికి చెందిన ఏజెంట్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య వివాదం చోటు చేసుకుంది. పోలీసుల జోక్యంతో గొడవ సర్ధుమణిగింది.
పొదిలి మండలంలో స్వల్ప ఉద్రిక్తత
ప్రకాశం జిల్లా పొదిలి మండలం దాసల్లపల్లి గ్రామంలోని పోలింగ్ బూత్ దగ్గర ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. అప్రమత్తమయిన పోలీసులు.. ఇరువర్గాలను చెదరగొట్టారు.
బ్యాలెట్‌ పేపర్లలో గుర్తులు తారుమారు
గుంటూరు జిల్లా నకరికల్లు మండలం నర్సింగపాడు రెండో వార్డు బ్యాలెట్‌ పేపర్లలో గుర్తులు తారుమారు కావడంతో అధికారులు పోలింగ్‌ నిలిపివేశారు.
మంచినీళ్లపేటలో ఎన్నికలు ఆపాలంటూ గ్రామస్తులు నిరసన
శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేటలో గందరగోళం నెలకొంది. ఎన్నికలు ఆపాలంటూ గ్రామస్తులు నిరసనకు దిగారు. 2019 ఓటర్ లిస్టు ప్రకారం ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు. 196 కొత్త ఓట్లు చేర్చటంపై అభ్యంతరం తెలిపారు.
విక్రమపురంలో ఏజెంట్ల మధ్య ఘర్షణ
విజయనగరం జిల్లా కొమరాడ మండలం విక్రమపురంలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ ఏజెంట్ల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో పోలింగ్ కేంద్రంలోనే నెలకొన్న ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అధికారులు, పోలీసులు జోక్యం చేసుకోవడంతో గొడవ సర్దుమణిగింది.
వైసీపీ – జనసేన పార్టీ వర్గాల మధ్య ఘర్షణ
గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం పమిడిపాడు పంచాయతీ ఎన్నికల్లో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైసీపీ – జనసేన పార్టీ వర్గాల మధ్య తోపులాట జరిగింది. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు అక్కడికి చేరుకుని ఇరు వర్గాలకు నచ్చజెప్పి.. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement