Wednesday, March 27, 2024

ఢిల్లీలో వైభవంగా సంక్రాంతి సంబురాలు.. ఆంధ్రప్రదేశ్ భవన్‌లో రెండు రోజుల వేడుకలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : దేశ రాజధాని ఢిల్లీలో సంక్రాంతి సంబురాలు అంబరాన్నంటాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగుదనం ఉట్టిపడేలా నిర్వహించిన వేడుకలు రాజధానివాసులను మైమరిపించాయి. శనివారం భోగి సందర్భంగా న్యూఢిల్లీలోని ఏపీ భవన్‌లో ఏర్పాటు చేసిన లేపాక్షి, ఆప్కో వస్త్రాలు, గిరిజన, సేంద్రీయయ ఉత్పత్తులు, ఫుడ్ స్టాల్స్‌ను భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్య సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, రెసిడెంట్ కమిషనర్ సౌరభ్ గౌర్, అడిషనల్ రెసిడెంట్ కమిషనర్ హిమాన్షు కౌశిక్ సిబ్బందితో కలిసి ప్రారంభించారు. తెలుగు ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. అనంతరం గొబ్బిళ్లు పెట్టి పాటలు పాడుతూ ఆటలాడారు. గంగిరెద్దు, హరిదాసుల వేషాల్లో మహిళలు అలరించారు.

నాలుగు యుగాలను ప్రతిబింబించేలా బెజవాడ కనక దుర్గమ్మ విగ్రహం వద్ద రమణీ సురేష్ ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు అందరినీ ఆకట్టుకుంది. అనంతరం పూజ చేసి భోగిమంటలు వేశారు. భవన్ ప్రాంగణంలోని బి.ఆర్ అంబేద్కర్ ఆడిటోరియంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. సినీ నటుడు, గాయకుడు సాయికిరణ్, మధుబాపు శాస్త్రి బృందం పాటలు, డాన్సులు, ఇతర కళాకారుల నృత్యాలు మైమరిపించాయి. ఆడిటోరియంలో ఉదయం ప్రదర్శించిన తెగింపు, మధ్యాహ్నం వేసిన వాల్తేరు వీరయ్య షోలకు భారీ సంఖ్యలో జనం హాజరయ్యారు.

ఆదివారం సంక్రాంతి వేడుకలు..

- Advertisement -

సంక్రాంతి సందర్భంగా ఆదివారం కూడా పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. పిల్లలకు డ్రాయింగ్, ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు, మహిళలు, పురుషులకు సంప్రదాయ వస్త్రధారణ పోటీలు జరగనున్నాయి. అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలూ ఉంటాయని భవన్ రెసిడెంట్ కమిషనర్లు వెల్లడించారు. రెండు రోజుల పాటు నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలైన వారికి బహుమతులను అందించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement