Monday, December 9, 2024

కోల్‌ ఇండియాలో వాటాల విక్రయం.. మొత్తం 5 కంపెనీల్లో వాటాల విక్రయానికి రెడీ

ప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్ముతున్న కేంద్రం తాజాగా మరో ఐదు సంస్థల్లో వాటాలను విక్రయించాలని నిర్ణయించింది. ప్రపంచంలోనే అతి పెద్ద కోల్‌ మైనింగ్‌ సంస్థ కోల్‌ ఇండియాను, ఆసియాలోనే అది పెద్ద జింక్‌ ఎగుమతి చేసే హిందూస్థాన్‌ జింక్‌లో వాటాలు విక్రయించాలని కేంద్రం యోచిస్తోంది. వీటితో పాటు రాష్ట్రీయ కెమిక్సల్‌ అండ్‌ ఫెర్టిలైజర్స్‌ లిమిటెడ్‌లోనూ వాటాలను విక్రయించాలని నిర్ణయించింది. వీటిల్లో 5 నుంచి 10 వాటాలను విక్రయించాలని కేంద్రం నిర్ణంచిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ద్వారా వాటాలను విక్రయించనున్నారు. వాటాలు విక్రయించే సంస్థల్లో రైల్వే శాఖ అధ్వర్యంలో నడుస్తున్న ఒక నమోదిత సంస్థ కూడా ఉందని బ్లూమ్‌బర్గ్‌ పేర్కొంది.

ఈ కంపెనీల ప్రస్తుత షేరు ధరను పరిగణలోకి తీసుకుంటే వాటాల విక్రయం ద్వారా 16,500 కోట్లు సమకూరుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఉక్రెయిన్‌, రష్యా వివాదంతో పెరిగిన ఖర్చులను తట్టుకునేందుకు ఈ నిధులు ఉపయోగపడతాయని ప్రభుత్వం భావిస్తోంది. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం వరసగా ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాలను విక్రయిస్తోంది. ఎయిర్‌ ఇండియా లాంటి కొన్ని సంస్థల్లో వంద శాతం వాటాలను విక్రయించింది. ఇవి పూర్తిగా ప్రైవేట్‌ సంస్థలు, వ్యక్తుల చేతుల్లోకి వెళ్లాయి.
2022 బడ్జెట్‌లో ఇలా వాటాల విక్రయం ద్వారా 65 వేల కోట్లు సమీకరించాలని కేంద్రం లక్ష్యంగా పెెట్టుకుంది.

ఇప్పటి వరకు ప్రధానంగా ఎల్‌ఐసీలో వాటాల విక్రయం ద్వారా 26,500 కోట్లు సేకరించకలిగింది. పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని చేరుకునేందుకే ప్రభుత్వం తాజాగా మరో ఐదు సంస్ధల్లో వాటాలు విక్రయించాలని నిర్ణయించిందని భావిస్తున్నారు.
వాటాల విక్రయంపై ఇన్వెస్టర్లు ఆకర్షించేందుకు ప్రభుత్వం ఇప్పటికే రోడ్‌షోలను ప్రారంభించింది. ఈ సంవత్సరం కోల్‌ ఇండియా షేరు 46 శాతం, రాష్ట్రీయ కెమికల్స్‌ షేరు 58 శాతం పెరిగాయి. హిందూస్థాన్‌ జింక్‌ షేరు ధర మాత్రం 7 శాతం పతనమైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement