Thursday, March 28, 2024

ఆదాయం కోసం ఆస్తుల విక్రయం.. హెచ్‌ఎండీఏ, టీఎస్‌ఐఐసీలు సిద్ధం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఆస్తుల అమ్మకం ద్వారా సర్కారుకు మరింత ఆదాయాన్ని సముపార్జించి పెట్టేందుకు నోడల్‌ ఏజెన్సీలు హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (హెచ్‌ఎండీఏ), తెలంగాణ పారిశ్రామిక మౌళిక సదుపాయాల కార్పొరేషన్‌(టీఎస్‌ఐఐసీ)లు భవిష్యత్‌ కార్యాచరణను సిద్ధం చేశాయి. పన్నేతర ఆదాయ లక్ష్యాలు చేరుకునే దిశగా అడుగులేస్తున్నాయి. సర్కారు భూములను అభివృద్ధి చేసి విక్రయించడం, లే అవుట్ల క్రమబద్ధీకరణ ద్వారా రుసుములు వసూలు చేయడం, రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్లు అమ్మడం లాంటి చర్యలను హెచ్‌ఎండీఏ ఇప్పటికే చేపట్టింది. ఇదే బాటలో త్వరలో మరిన్ని భూములను అమ్మేందుకు హెచ్‌ఎండీఏ సిద్ధమవుతోంది.

హెచ్‌ఎండీఏ పరిధిలో వివిధ ప్రాంతాల్లో వందల ఎకరాల ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నాయి. కానీ చాలా చోట్ల వివాదంలో ఉండడంతో లే అవుట్‌ల అభివృద్ధి, ఫ్లాట్‌ల విక్రయాల్లో జాప్యం చోటు చేసుకుంటోంది. ఈ క్రమంలో ఎలాంటి వివాదాలు లేని భూములపై అధికారులు తాజాగా దృష్టి సారించారు. గతంలోనే అమ్మకానికి సిద్ధం చేసిన పలు భూములపై అధికారులు తాజాగా దృష్టిసారించిన అధికారులు వాటి లే అవుట్‌లు రూపొందించే పనిలో బిజీగా ఉన్నారు.

- Advertisement -

క్రమబద్ధీకరణకు సన్నద్ధం…

లే అవుట్‌ల క్రమబద్ధీకరణ కోసం ఇప్పటికే చర్యలు చేపట్టిన హెచ్‌ఎండీఏ తన పరిధిలోని సుమారు 1000 లే అవుట్‌లను క్రమబద్ధీకరించే అవకాశమున్నట్లు ఇప్పటికే గుర్తించారు. ఈ లేఅవుట్‌లన్నీ ఎకరంపైవే కావడంతో వీరంతా ఇప్పటికే ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసి ప్రాథమిక రుసుము కూడా చెల్లించారు. క్రమబద్ధీకరణ పూర్తయితే హెచ్‌ఎండీఏకు రూ.300 కోట్ల ఆదాయం వచ్చే అవకాశాలున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

మరిన్ని భూముల వేలానికి టీఎస్‌ఐఐసీ నోటిఫికేషన్‌…

ఇప్పటికే హైదరాబాద్‌ ఖానామెట్‌తో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోని భూములను వేలం వేసిన తెలంగాణ ఇండస్ట్రియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌(టీఎస్‌ఐఐసీ) త్వరలో మరిన్ని భూముల వేలానికి రంగం సిద్ధం చేసింది. త్వరలో కవాడిపల్లి, చందానగర్‌లోని భూములను వేలం వేయనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్‌ జారీ చేసింది. వీటితో పాటు గతంలో నోటిఫికేషన్‌ జారీ చేసి మధ్యలో ఆగిపోయిన హైదరాబాద్‌లోని పలు ప్రైమ్‌ ప్రాంతాల్లోని భూముల వివాదాలు కోర్టులో ఉండడంతో వాటిని త్వరగా పరిష్కరించేందుకు టీఎస్‌ఐఐసీ చురుగ్గా పావులు కదుపుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement