Tuesday, April 23, 2024

మూడు రోజుల్లోనే 1,137 ఫ్లాట్ల విక్రయం.. 8,000 కోట్ల ఆదాయం

హౌసింగ్‌ ప్రాజెక్ట్‌లో 1,137 విలాసవంతమైన ప్లాట్లను విక్రయించినట్లు ప్రముఖ స్థిరాస్తి సంస్థ డీఎల్‌ఎఫ్‌ లిమిటెడ్‌ గురువారం ప్రకటించింది. గురుగ్రామ్‌లోని తమ హౌసింగ్‌ ప్రాజెక్ట్‌లో ఒక్కో ఫ్లాట్‌ ధర రూ.7 కోట్ల పైనే ఉంటుందని సంస్థ పేర్కొంది. దీంతో సంస్థకు రూ.8,000 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపింది. కేవలం మూడు రోజుల్లోనే విక్రయాలు పూర్తయినట్లు వెల్లడించింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ప్రీమియం ఫ్లాట్లకు ఉన్న డిమాండుకి ఇది నిదర్శనమని పేర్కొంది. గురుగ్రామ్‌లోని సెక్టార్‌ 63, గోల్ఫ్‌ కోర్స్‌ ఎక్స్‌టెన్షన్‌ రోడ్‌ ప్రాంతంలో ది అర్బర్‌ పేరుతో ఈ హౌసింగ్‌ ప్రాజెక్టును 25 ఎకరాల్లో అభివృద్ది చేశామని, ఈ ప్రాజెక్ట్‌లో మొత్తం ఐదు టవర్లు ఉంటాయి.

ఒక్కో దాంట్లో 38-39 అంతస్తులుంటాయని డీఎల్‌ఎఫ్‌ తెలిపింది. ఒక్కో ఫ్లాట్‌లో 4 బెడ్‌ రూమ్‌లు ఉన్నాయని, విక్రయాలు అధికారికంగా ప్రారంభించడానికి ముందు నిర్వహించిన ప్రీ-ఫార్మల్‌ లాంఛ్‌లోనే ఈ ఫ్లాట్లన్నీ అమ్ముడైనట్లు సంస్థ పేర్కొంది. మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ పరంగా భారతదేశంలో డీఎల్‌ఎఫ్‌ అతిపెద్ద స్థిరాస్తి సంస్థ. ఏప్రిల్‌-డిసెంబర్‌ మధ్య సంస్థ సేల్స్‌ బుకింగ్‌లు 45 శాతం వృద్ధితో రూ.6,599 కోట్లకు చేరాయి. గత ఏడాది ఇదే సమయంలో ఆ విలువ రూ.4,544 కోట్లుగా ఉంది. ఈ ఏడాది ఢిల్లి, గురుగ్రామ్‌, పంచకుల, చెన్నైలో రెసిడెన్షియల్‌ ప్రాజెక్టులను ప్రారంభించింది.

- Advertisement -

ఈ కంపెనీ ఇప్పటి వరకు 330 మిలియన్‌ చదరపు అడుగుల్లో 153 ప్రాజెక్టులు అభివృద్ధి చేసింది. త్వరలోనే రూ.7,500 కోట్ల ఆదాయ వనరులతో ది అర్బర్‌ ప్రాజెక్టు విక్రయాలు ప్రారంభిస్తామని జనవరిలో కంపెనీ ప్రకటించింది. డీఎల్‌ఎఫ్‌, సింగపూర్‌ సావరిన్‌ వెల్త్‌ ఫండ్‌ జీఐసీ మధ్య జాయింట్‌ వెంచర్‌ సంస్థ అయిన డీఎల్‌ఎఫ్‌ సైబర్‌ సిటీ డెవలపర్స్‌ లిమిటెడ్‌ (డీసీసీడీఎల్‌) ద్వారా అద్దెకు ఇచ్చే వాణిజ్య ఆస్తులు ఎక్కువగా ఉన్నాయి. ఈ జాయింట్‌ వెంచర్‌లో డీఎల్‌ఎఫ్‌ దాదాపు 67 శాతం వాటాను కలిగి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement