Monday, October 7, 2024

TG | సబ్యసాచి ఘోష్‌కు స్పెషల్‌ సీఎస్‌గా పదోన్నతి.. ఉత్తర్వులు జారీ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : పశుసంవర్ధక, డైరీ అభివృద్ధి, మత్స్యశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న సబ్యసాచిఘోష్‌ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో పదోన్నతిని పొందారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రసత్తుతం నిర్వహిస్తున్న విధుల్లోనే కొనసాగిస్తూ రీ డిజిగ్నేట్‌ చేస్తూ సీఎస్‌ శాంతికుమారి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఆయన తన ప్రారంభ ఉద్యోగ జీవితం వరంగల్‌, విజయనగరం, పశ్చిమగోదావరి, కరీంనగర్‌ జిల్లాలలో కొనసాగించారు. 2002 జాతీయ క్రీడల వేడుకలకు ప్రత్యేక అధికారిగా పనిచేశారు. 2003లో మొదటి ఆఫ్రో ఆసియా క్రీడలకు ప్రత్యేక అధికారిగా, భారీ, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను (గచ్చిబౌలి, స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌, 7 స్టేడియంలు) విజయవంతంగా నిర్వహించారు.

2004 – 2011 మధ్య కాలంలో పర్యాటక, ఆర్థిక, క్రీడల శాఖలో సేవలందించారు. హైదరాబాదులో ఏసియన్‌ డెవలప్‌ మెంట్‌ ఏజీఎంగా 2005లో మిలిటరీ వరల్డ్‌ గేమ్స్‌ కు ముఖ్యకార్యక్రమాల నిర్వహణ బాధ్యతలు నిర్వహించారు. మిలిటరీ వరల్డ్‌ గేమ్స్‌ విలేజ్‌ అభివృద్ధికి ఆయన సముచితంగా సేవలందించారు.

2011 – 2016 మధ్యకాలంలో, పరిశ్రమలు, వాణిజ్యశాఖలో బాధ్యతలు నిర్వర్తించారు (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ) ఈ సమయంలో పరిశ్రమల ప్రోత్సాహకంతో పాటు, మైనింగ్‌, ఎంఎస్‌ఎంఈ, హ్యాండ్లూమ్స్‌, టెక్స్‌టైల్స్‌, పరిశ్రమల మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఆహార ప్రాసెసింగ్‌, చర్మ, ఖాధీ, గ్రామీణ పరిశ్రమలు వంటి ముఖ్యమైన అంశాలలో విశిష్ట సేవలందించారు.

2015-2016లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఫైనాన్స్‌కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా సేవలందించారు. 2017 – 2024 మధ్య, యువజన సర్వీసుల శాఖకు కార్యదర్శి, ముఖ్య కార్యదర్శిగా సేవలందించారు. తెలంగాణ సొసైటీ ఫర్‌ ట్రేనింగ్‌, ఎంప్లాయిమెంట్‌, ప్రమోషన్‌ (స్టెప్‌,సెట్విన్‌) సంస్థలకు ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. యువతకు నైపుణ్యాభివృద్ధి, శిక్షణ, ఉద్యోగ ప్రమోషన్‌ కార్యక్రమాలలో విశిష్ట సేవలు అందించారు.

- Advertisement -

ఆయన క్రీడా విశారదుడే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో పురుషుల డబుల్స్‌ దేశం తరుపున షటిల్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్లలో ప్రాతినిధ్యం వహించారు. 2014 – 2018 మధ్య కాలంలో ఆయన మొదటి తెలంగాణ అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా భాద్యతలు నిర్వహించారు. ఆయనకు ప్రధానంగా ఐటి, పరిశ్రమలు, వాణిజ్య, క్రీడలు, పర్యాటకం, నైపుణ్యాభివృద్ధి రంగాలలో విశిష్ట నైపుణ్యం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement