Saturday, April 20, 2024

రష్యా చమురు దిగుమతులు పైపైకి.. తొమ్మిదవ నెలలోనూ గరిష్ట దిగుమతులు

చౌకైన రష్యా చమురు దిగుమతి మే నెలలో మరో కొత్త గరిష్టాన్ని తాకింది. సౌదీ అరేబియా, ఇరాక్‌, యుఎఇ, యుఎస్‌ నుండి కొనుగోలు చేసిన మొత్తం చమురుకంటే రష్యా దిగుమతులే ఎక్కువ అని డేటా వెల్లడిస్తోంది. ఎనర్జీ కార్గో ట్రాకర్‌ వోర్టెక్సా డేటా ప్రకారం, మేలో రష్యా నుండి భారతదేశం రోజుకు 1.96 మిలియన్‌ బ్యారెల్స్‌ను దిగుమతి చేసుకుంది. ఇది ఏప్రిల్‌లో మునుపటి గరిష్టం కంటే 15 శాతం ఎక్కువ. భారత్‌ దిగుమతి చేసుకునే మొత్తం చమురులో రష్యావాటా ఇప్పుడు 42 శాతానికి చేరుకుంది. అదే సమయంలో సౌదీ అరేబియా నుండి దిగుమతులు 560,000 టన్నులకు పడిపోయాయి. ఫిబ్రవరి 2021 తర్వాత ఇది అత్యల్పం.

- Advertisement -

భారతదేశ చమురు దిగుమతుల్లో చమురు ఉత్పత్తిదారుల కార్టెల్‌ ఒపెక్‌ వాటా మే నెలలో ఆల్‌ టైమ్‌ కనిష్ట స్థాయి 39 శాతానికి పడిపోయింది. పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ, ప్రధానంగా మధ్యప్రాచ్యం, ఆఫ్రికాలో, ఒక సమయంలో భారతదేశం దిగుమతి చేసుకున్న మొత్తం ముడి చమురులో 90 శాతం వరకు ఉంది. అయితే రష్యా చమురు అందుబాటులోకి వచ్చినప్పటి నుండి ఇది తగ్గుతూ వస్తోంది. వరుసగా ఎనిమిదో నెలలో, భారతదేశం దిగుమతి చేసుకున్న మొత్తం చమురులో 42 శాతం వాటాతో రష్యా అతిపెద్ద ముడి చమురు సరఫరాదారుగా కొనసాగింది. మే నెలలో, ఇరాక్‌ రోజుకు 0.83 మిలియన్‌ బ్యారెల్స్‌ (బిపిడి) చమురును సరఫరా చేసింది. యుఎఇ 203,000 బిపిడిని రవాణా చేసింది. ఫిబ్రవరి 2022లో రష్యా-ఉక్రెయిన్‌ వివాదం ప్రారంభమయ్యే ముందు రష్యా చమురు దిగుమతి 1శాతం కంటే తక్కువగా ఉండేది.

ఇప్పుడది ఏకంగా 42 శాతం వాటాను తీసుకొని రోజుకు 1.96 మిలియన్‌ బ్యారెళ్లకు పెరిగింది. మేలో భారతదేశం దిగుమతి చేసుకున్న 4.7 మిలియన్‌ బిపిడి చమురులో ఒపెక్‌ 1.8 మిలియన్‌ బిపిడిని సరఫరా చేసింది. 2017-18 నుండి భారతదేశానికి కీలక చమురు సరఫరాదారుగా ఉన్న ఇరాక్‌ నుంచి సరఫరా ప్రస్తుతం 0.83 మిలియన్‌ బిపిడికి పడిపోయింది. అదే సమయంలో రష్యా నుండి కొనుగోళ్లు పెరిగాయి. ప్రస్తుతం రష్యా, ఇరాక్‌ తర్వాత సౌదీ అరేబియా 3వ స్థానానికి పడిపోయింది. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం మొదలైన తర్వాత, రవాణా ఖర్చులతో కలిపి రష్యన్‌ ముడి చమురు సగటు ధర బ్యారెల్‌కు 68.21 డాలర్లు. ఉక్రెయిన్‌ యుద్ధం తర్వాత ఇది కనిష్ట స్థాయి. ఏప్రిల్‌లో భారతదేశానికి పంపిన సౌదీ అరేబియా క్రూడ్‌ సగటు ధర బ్యారెల్‌కు 86.96 డాలర్లు కాగా, ఇరాక్‌ చమురు బ్యారెల్‌ ధర 77.77డాలర్లుగా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement