Thursday, April 25, 2024

మోసం, కోర్టు ధిక్కరణ ఆరోపణలు.. రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీకి 9 ఏళ్ల జైలు, రూ.8.75లక్షల జరిమానా

రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీకి కోర్టు 9 ఏళ్ల జైలు శిక్ష విధించింది. జైలుతో పాటు రూ.8.75 లక్షల జరిమానా విధించింది. రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ.. మోసం, కోర్టు ధిక్కరణ అభియోగాలకు సంబంధించిన కేసుల్లో దోషిగా తేలారు. దీంతో అలెక్సీకి స్థానిక కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. కోర్టు తీర్పును నావల్నీ మద్దతుదారులు తీవ్రంగా ఖండించారు. ఇప్పటికే అలెక్సీ నావల్నీ.. రష్యా రాజధాని మాస్కోకు తూర్పున ఉన్న జైల్లో రెండున్నరేళ్లుగా శిక్ష అనుభవిస్తున్నారు. తాజాగా కోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీలుకు వెళ్లే వెసులుబాటు నావెల్నీకి ఉంటుంది. 45 ఏళ్ల నావల్నీ.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు రాజకీయాల్లో బద్ధ శత్రువు. ఉద్దేశపూర్వకంగా నావల్నీని దీర్ఘ కాలం పాటు జైలుకు పరిమితం చేయాలని పుతిన్‌ భావిస్తున్నారు. నావల్నీ ఓ పాత కేసులో పెరోల్‌ నిబంధనలను ఉల్లంఘించారన్న అభియోగాలపై ఇప్పటికే రెండున్నరేల్ల జైలు శిక్ష అనుభవిస్తున్నారు. పుతిన్‌ వాస్తవానికి భయపడుతున్నాడని, తన పాలన గురించి రష్యా ప్రజలు నిజం తెలుసుకుంటారని ఆందోళన కనిపిస్తోందని నావల్నీ చెప్పుకొచ్చాడు. శిక్షను ప్రకటించిన తరువాత.. నావల్నీ న్యాయవాదులిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని కొద్దిసేపటి తరువాత విడుదల చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement