Friday, April 19, 2024

కనిష్ఠస్థాయికి రూపాయి, కరిగిపోనున్న ఫారెక్స్‌ నిధులు..

అమెరికా డాలర్‌తో పాలిస్తే భారత కరెన్సీ రూపాయి విలువ సోమవారం నాడు రికార్డు స్థాయికి పడిపోయింది. అన్ని మార్కెట్లలో డాలర్‌కు డిమాండ్‌ పెరగడంతో రూపాయి విలువ డాలర్‌కు 77.50కు చేరుకున్నది. ఇంత దిగువ స్థాయికి రూపాయి విలువ పడిపోవడం ఇదే మొదటిసారి. గతంలో 77.05 వరకు పడిపోయిన దాఖలాలు ఉన్నాయి. ఇంటర్‌ బ్యాంక్‌ ఫారిన్‌ ఎక్స్‌చేంజ్‌ మార్కెట్‌లో సోమవారం ఉదయం 77.17తో ఓపెన్‌ అయింది. అయితే సెషన్‌ ముగిసేసమయానికి 60 పైసల విలువ తగ్గి… 77.50కు చేరుకున్నది. సెషన్‌ సమయంలో ఒక దశలో 77.52కు పడిపోయింది.ఈ స్థాయికి పడిపోవడం చరిత్రలోనే ఇది తొలిసారి. ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో గ్లోబల్‌ సెంట్రల్‌ బ్యాంక్‌లు వడ్డీ రేట్లను పెంచే ప్రమాదం ఉన్నదని భావిస్తున్న ఫారెక్స్‌ ట్రేడర్స్‌ డాలర్ల కొనుగోలు ఎక్కువగా ఎగబడ్డారని అంటున్నారు. దీంతో రెండు దశాబ్దలలో ఎన్నడూ లేనంత స్థాయికి డాలర్‌ చేరుకున్నది. అమెరికా ఫెడరల్‌ రిజర్వు కూడా వడ్డీరేట్లు పెంచవచ్చునన్న వార్తలు డాలర్‌ విలువను మరింత పెంచింది. చైనాలో లాక్‌డౌన్‌ మరింత కఠినంగా అమలు జరపడం, ఉక్రెయిన్‌ వార్‌ నేపథ్యంలో రష్యా చమురును నిషేధించాలని యూరప్‌ దేశాలు ఆలోచిస్తుండడంతో డాలర్‌పై ఒత్తిడి పెరిగింది.

మేజర్‌ కరెన్సీ బాస్కెట్‌లో అమెరికా డాలర్‌ 104.19కి చేరుకొని అగ్రస్థానంలో నిచింది. రూపాయి విలువ పతనంతో మన దేశ ఫారెక్స్‌ నిధులపై కలవరం ప్రారంభమైంది. ప్రస్తుతం 600 బిలియన్‌ డాలర్ల ఫారెక్స్‌ నిధులు మన వద్ద ఉన్నాయి. ఈ ఏడాదిలో ఇదే అత్యంత కనిష్ట స్థాయి. రూపాయి విలువ పడిపోవడంతో ఈ నిధుల విలువ కూడా ఆ మేరకు పడిపోతుంది. రిజర్వు బ్యాంక్‌ అందించిన గణాంకాల ప్రకారం ఏప్రిల్‌ 29 నాటికి మన ఫారెక్స్‌ నిధులు 2.695 బిలియన్‌ల డాలర్ల మేర పడిపోయి 597.728 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నది. ఫారెక్స్‌ నిధులు పడిపోవడం ఇది వరసగా ఎనిమిదో వారం. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభించిన తరువాతనే మన విదేశీ మరక నిల్వలు పడిపోవడం ప్రారంభమైంది. ఫిబ్రవరి నుంచి చూసుకుంటే దాదాపు 34 బిలియన్ల డాలర్ల మేర ఫారెక్స్‌ నిధులు తగ్గిపోయాయి. ఈ నిధులను 630 బిలియ్‌న్ల డాలర్ల పైచిలుకు తీసుకుపోవాలంటే మరో ఏడాది పట్టవచ్చు. ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా చమురు దిగుమతుల కోసం మనం ఎక్కువగా ఫారెక్స్‌ నిధులను వినియోగించాల్సి వస్తున్నది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement