Friday, April 19, 2024

Delhi | ఆ దేశాల నుంచి వచ్చేవారికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు.. కేంద్రం సరికొత్త మార్గదర్శకాలు జారీ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: కోవిడ్-19 పుట్టినిల్లు చైనా సహా పలు దేశాల్లో సరికొత్త రకం వైరస్ ప్రమాద ఘంటికలు మోగిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కోవిడ్ కొత్త కేసులు భారీగా నమోదవుతున్న చైనా, జపాన్, దక్షిణ కొరియా, హాంకాంగ్, థాయ్‌లాండ్ దేశాల నుంచి భారత్ చేరుకునే ప్రయాణికులకు ఆర్టీ-పీసీఆర్ పరీక్షల్ని తప్పనిసరి చేస్తున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా ప్రకటించారు. కొద్ది రోజుల క్రితం నిలిపేసిన సువిధ పోర్టల్‌ను మళ్లీ ప్రారంభించినట్టు వెల్లడించారు. ఈ పరీక్షల్లో ఎవరికైనా కోవిడ్-19 ఉందని తేలితే వారిని క్వారంటైన్‌లో ఉంచనున్నట్టు వెల్లడించారు. అలాగే విదేశాల నుంచి భారత్ వచ్చే ప్రతి ప్రయాణికుడు తన ప్రయాణ వివరాలు, వ్యాక్సినేషన్ వివరాలు ఈ పోర్టల్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది.

చైనాలో మరణ మృదంగం మోగిస్తున్న తాజా వేవ్ వెనుక కరోనా వైరస్ ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఎఫ్.7 రకం కారణమని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో భారత్‌లో నమోదయ్యే కొత్త కేసులకు సంబంధించి శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపంచాల్సిందిగా కేంద్రం ఇప్పటికే అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. అలాగే ‘టెస్ట్-ట్రేస్-ట్రీట్ అండ్ వ్యాక్సినేట్’ను అనుసరించాల్సిందిగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది. మరోవైపు క్రిస్మస్, కొత్త సంవత్సరంతో పాటు మకర సంక్రాంతి పండుగల నేపథ్యంలో ప్రజలందరూ రద్దీ ఏర్పడకుండా చూడాలని, బహిరంగ ప్రదేశాల్లో మాస్కు ధరించాలని, భౌతిక దూరం పాటించడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, హ్యాండ్ శానిటైజర్లను ఉపయోగించాలని కేంద్ర ప్రభుత్వంతో పాటు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా సూచించింది.

కోవిడ్-19 తాజా పరిస్థితి, సంసిద్ధతపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విడివిడిగా అత్యున్నత స్థాయి సమావేశాలు సైతం నిర్వహించారు. ఇప్పుడు తాజాగా కోవిడ్-19 సెకండ్ వేవ్ నాటి అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ప్రతి రాష్ట్రంలో మెడికల్ ఆక్సిజన్ లభ్యతపై రాష్ట్రాలకు కేంద్రం కొన్ని సూచనలు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement