Tuesday, April 23, 2024

ఆర్టీసీకి సంక్రాంతి ఆదాయం రూ.165 కోట్లు.. 11 రోజుల్లో 2 కోట్ల మంది ప్రయాణం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : సంక్రాంతి పండుగ టీఎస్‌ ఆర్టీసీకి కాసుల పంట పండించింది. పండుగ సందర్భంగా ఆర్టీసీ ప్రవేశ పెట్టిన ప్రత్యేక బస్సులకు ప్రయాణికుల నుంచి విశేష ఆదరణ లభించింది. సంక్రాంతి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులకు సాధారణ చార్జీలనే వసూలు చేయడంతో పాటు ముందుగానే రానుపోను టికెట్‌ బుకింగ్‌ చేసుకుంటే టీఎస్‌ ఆర్టీసీ 10 శాతం రాయితీ ఇస్తున్నట్లు ప్రకటించడం కూడా ఈసారి పండగకు భారీ ఆదాయాన్ని సమకూర్చిపెట్టింది. అలాగే, టోల్‌ ప్లాజాల వద్ద ఆర్టీసీ ప్రయాణికుల కోసం ప్రత్యేక లేన్లను ఏర్పాటు చేయడంతో దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఆర్టీసీ బస్సులను ఎంచుకున్నారు. మొత్తంగా సంక్రాంతి పండుగ సందర్భంగా ఆర్టీసీకి 11 రోజుల్లో రూ.165.46 కోట్ల ఆదాయం సమకూరింది. 11 రోజుల్లో 2.82 కోట్ల మంది ప్రజలు ప్రయాణించారు. కాగా ఈ సారి ఆర్టీసీ పొందిన ఆదాయం గత ఏడాదితో పోలిస్తే 62.29 కోట్లు ఎక్కువ రాబడి వచ్చింది.

ఇక కి.మీ.ల విషయానికి వస్తే రికార్డు స్థాయిలో సంక్రాంతికి 3.57 కోట్ల కి.మీ.ల మేర టీఎస్‌ ఆర్టీసీ బస్సులు తిరిగాయి. గత ఏడాదితో పోలిస్తే 26.60 లక్షల కి.మీ.లు అదనంగా బస్సులు తిరిగాయి. ప్రతీ రోజు సగటున 2.42 లక్షల కి.మీ.లు అదనంగా బస్సులు నడిచాయి. ఈసారి బస్సుల్లో ఆక్యుపెన్సీ పెరగడం కూడా విశేషం. గత ఏడాదికి ఆక్యుపెన్సీ రేషియో 59.17గా ఉంటే ఈ సంక్రాంతికి అది 71.19కి చేరడం గమనార్హం. ఈ సందర్భంగా టీఎస్‌ ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ మాట్లాడుతూ టీఎస్‌ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితమనే విషయాన్ని ప్రజలు మరోమారు నిరూపించారని పేర్కొన్నారు. సాధారణ చార్జీలతోనే 3923 ప్రత్యేక బస్సులను నడపడం వల్ల మా సంస్థపై ప్రయాణికులకు నమ్మకం పెరిగింది. అంతేకాదు, రద్దీకి అనుగుణంగా సిబ్బంది అద్భుతంగా పని చేశారు. ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారని ప్రశంసించారు.

- Advertisement -

ఎండి సజ్జన్నార్‌ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా సంస్థ సిబ్బంది నిబద్ధతతో పని చేశారనీ, వారి కృషి వల్లనే మంచి ఫలితాలు వచ్చాయని ప్రశంసించారు. హైదరాబాద్‌లోని రద్దీ ప్రాంతాలైన ఉప్పల్‌, ఎల్బీనగర్‌, ఆరాంఘర్‌, కేపీహెచ్‌బి, బోయిన్‌పల్లిలో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేశామనీ, అక్కడ ప్రయాణికుల సౌకర్యార్థం బయో టాయిలెట్లు, తాగునీరు, కుర్చీలను అందుబాటులో ఉంచామని తెలిపారు. ప్రయాణికులకు సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చిన ఆర్టీసీ కుటుంబంలోని ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఇదే ఉత్సాహంతో రాబోయే రోజుల్లో ప్రయాణికులకు వేగవంతమైన సేవలు అందించాలని సూచించారు. అలాగే, రవాణా, పోలీస్‌, ఎన్‌హెచ్‌ఏఐ అధికారులకు ఈ సందర్భంగా బాజిరెడ్డి, సజ్జన్నార్‌ కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement