Friday, March 29, 2024

మరో బాదుడుకు సిద్ధమైన ఆర్టీసీ.. డీజిల్‌ సెస్‌ పేరుతో ప్ర‌యాణికుల‌ భారం..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ ఆర్టీసీ) ప్రయాణికులపై మరోసారి బాదుడుకు సిద్ధమైంది. డీజిల్‌ సెస్‌ పేరుతో ప్రయాణికుల నుంచి అదనపు ఛార్జీలను వసూలు చేయాలని నిర్ణయించింది. పెంచిన ఛార్జీలను గురువారం ఉదయం నుంచి అమలు చేస్తున్నట్టు ప్రకటించింది. కిలో మీటరు వారీగా డీజిల్‌ సెస్‌ను విధించాలని నిర్ణయించిన ఆర్టీసీ అందుకు స్లాబ్‌లను ఖరారు చేసింది. డీజిల్‌ సెస్‌ పెరగడంతో బస్సు ఛార్జీలను పెంచడం మినహా మరో ప్రత్యామ్నాయం లేదని స్పష్టం చేసింది. తక్కువ దూరం ప్రయాణించే వారిపై భారం పడకుండా ఈ స్లాబ్‌లను ప్రతిపాదించింది. పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌, డీలక్స్‌, సూపర్‌ లగ్జరీ బస్సుల్లో డీజిల్‌ సెస్‌ పేరుతో కనీస ఛార్జీని రూ.5గా నిర్ణయించింది. కనిష్ట, గరిష్ట దూరాన్ని బట్టి టికెట్ల ఛార్జీలను ఖరారు చేసింది. గ్రామీణ ప్రాంత ప్రజలు తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు ఎక్కువగా ఎక్కే పల్లె వెలుగు బస్సుల్లో 250 కిలోమీటర్ల దూరానికి రూ.5 నుంచి రూ.45 సెస్‌ పేరుతో ప్రయాణికుల నుంచి వసూలు చేయాలని నిర్ణయించింది.

ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో 500 కిలోమీటర్ల వరకు రూ.5 నుంచి రూ.90 వరకు, ఎక్స్‌ప్రెస్‌ బస్సులో 500 కిలోమీటర్ల దూరానికి రూ.5 నుంచి రూ.90లను పెంచాలని, సూపర్‌ లగ్జరీలో రూ.10 నుంచి 130 రూపాయలు, డీలక్స్‌ బస్సుల్లో 500 కిలోమీటర్ల వరకు రూ.5 నుంచి 125 రూపాయలను, ఎయిర్‌ కండిషనర్‌ బస్సుల్లో 500 కిలోమీటర్ల వరకు రూ.10 నుంచి 170 రూపాయలు పెంచాలని ప్రతిపాదించింది. హైదరాబాద్‌ జంట నగరాల పరిధితో పాటు సబర్బన్‌ బస్సుల్లో అదనంగా ఎటువంటి ఛార్జీలను వసూలు చేయరాదని నిర్ణయించినట్టు ఆర్టీసీ ఉన్నతాధికారులు చెప్పారు. ఆర్టీసీని పరిరక్షించాలంటే ప్రయాణికుల భారం వేయకతప్పదని ఆ సంస్థ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్దన్‌ చెప్పారు. తక్కువ దూరం ప్రయాణించే వారిపై భారం పడకుండా ఛార్జీలను నిర్ణయించామని డీజిల్‌ సెస్‌ పెంచడం అనివార్యంగా భావిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement