Wednesday, June 16, 2021

ఫెద‌ర‌ర్ అభిమానుల‌కు ఓ చేదు వార్త..

టెన్నిస్ దిగ్గజం స్విస్ మాస్ట‌ర్ రోజ‌ర్ ఫెద‌ర‌ర్ ఓ బ్యాడ్ న్యూస్ చెప్పాడు..ప్ర‌స్తుతం న‌డుస్తున్న ఫ్రెంచ్ ఓపెన్‌లో తాను ఎన్ని రోజులు కొన‌సాగుతానో తెలియ‌ద‌ని ఫెడెక్స్ అన్నాడు. ఫ్రెంచ్ ఓపెన్‌లో కొన‌సాగాలో వ‌ద్దో నేను నిర్ణ‌యించుకోవాలి. మోకాలిపై ఇంత‌టి భారం వేయ‌డం స‌రైన‌దో కాదో తెలియడం లేదు. రెస్ట్ తీసుకోవ‌డానికి ఇదే స‌రైన స‌మ‌య‌మా అన్నది ఆలోచిస్తున్నాను అని ఫెడెక్స్ చెప్పాడు. శ‌నివారం రాత్రి మూడున్న‌ర గంట‌ల పాటు జ‌రిగిన మూడో రౌండ్ మ్యాచ్‌లో ఫెద‌ర‌ర్‌.. 7-6, 6-7, 7-6, 7-5 తేడాతో 59వ ర్యాంక్ ప్లేయ‌ర్ డొమినిక్ కోఫ‌ర్‌పై అతి క‌ష్ట‌మ్మీద గెలిచాడు. సోమ‌వారం ఇట‌లీకి చెందిన మాటెయో బెరెటినితో నాలుగో రౌండ్‌లో త‌ల‌ప‌డాల్సి ఉంది. అయితే తాను ఆడ‌తానో లేదో తెలియ‌ద‌ని ఫెద‌ర‌ర్ చెప్ప‌డం గ‌మ‌నార్హం.

గ‌తేడాది ఫెద‌ర‌ర్ మోకాలికి రెండు స‌ర్జ‌రీలు జ‌రిగాయి. దీంతో చాలా వ‌ర‌కూ టోర్నీల‌కు అత‌డు దూరంగా ఉన్నాడు. మ‌రో రెండు నెల‌ల్లో 40వ ఏట అడుగుపెడుతున్న ఫెడెక్స్‌కు.. టెన్నిస్‌లో వ‌స్తున్న యువకుల‌ను ఎదుర్కోవ‌డం స‌వాలుగా మారింది. ప్ర‌తి మ్యాచ్‌కు ముందు నా ప‌రిస్థితిని అంచ‌నా వేసుకుంటాను. నా మోకాలు ఎలా ఉందో చూసుకుంటాను. ఆ త‌ర్వాతే కొన‌సాగాలో వ‌ద్దో నిర్ణ‌యించుకుంటాను అని ఫెడెక్స్ అన్నాడు. ఇప్ప‌టికే 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలిచిన ఈ స్విస్ మాస్ట‌ర్‌.. త‌న ఆల్‌టైమ్ ఫేవ‌రెట్ వింబుల్డ‌న్‌నే ఎక్కువ ప్రాధాన్య‌త ఇస్తున్నాడు. జూన్ 28 నుంచి వింబుల్డ‌న్ ప్రారంభం కాబోతోంది.

Advertisement

తాజా వార్తలు

Prabha News