Tuesday, May 30, 2023

రాకెట్రీ : ది నంబి ఎఫెక్ట్ రివ్యూ..

ఇప్ప‌టికే ప‌లు భాష‌ల్లో ప‌లువురి బ‌యోపిక్ లు తెర‌కెక్కాయి.వాటిల్లో కొన్ని హిట్ అవ్వ‌గా..మ‌రికొన్ని ప్లాప్ అయ్యాయి. మ‌రి తాజాగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన బ‌యోపిక్ చిత్రం రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్‌.మ‌రి ఈ చిత్రం హిట్టా..ఫ‌ట్టా చూద్దాం..

- Advertisement -
   

హీరో మాధ‌వ‌న్ తాను నటిస్తూ , రచన , దర్శకత్వం చేస్తూ ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఎంతగానో ఆ స్టోరీ లైన్ ని లేదా స్క్రిప్టుని ప్రేమిస్తే తప్ప ఇది జరిగే పని కాదు. పోనీ అతను ఎన్నుకున్న బయోపిక్ ఓ స్పోర్ట్స్ పర్శన్ నో లేక పాపులార్టీ ఉన్న సెలబ్రెటీదో కాదు ఓ సైంటిస్ట్ ది. సామాన్యులకు ఆ సైంటిస్ట్ ఎవరో తెలియదు. అయినా మాధవన్ ఆ సాహసం చేసారు.

కథ ఏంటంటే.. నంబి నారాయణన్ (మాధవన్) ఇస్రో శాస్త్రవేత్తని పోలీస్ లు అరెస్ట్ చేస్తారు. మన దేశ రహస్యాలు పాకిస్తాన్‌కు చేరవేశారనే అభియోగం వ‌స్తుంది. కొన్ని రోజుల తర్వాత బెయిల్ మీద బయటకు వస్తారు. ఆ త‌ర్వాత హీరో సూర్య ఆయనని ఓ టీవీ స్టూడియోలో ఇంట‌ర్వ్యూ చేస్తారు. ఆ క్రమంలో అసలు నంబి నారాయణ్ ప్రస్దానం ఎలా మొదలైంది.. అమెరికా ప్రిన్స్‌ట‌న్ విశ్వవిద్యాల‌యంలో నంబి నారాయ‌ణ‌న్ చ‌దువుకున్న రోజులు ఎలా గడిచాయి.. ఆయన ఇస్రోలో చేరటం…అక్కడ అంతరిక్ష పరిశోధనలు దిసగా ఆయన చేసిన కృషి..ఆ తర్వాత ఆయనపై పడిన ఆరోప‌ణ‌లు. వాటినుంచి కొన్నాళ్లకు నిర్దోషి అని తెలుయటం. పోలీసులు అరెస్ట్ తర్వాత నంబితో పాటు అతని కుటుంబాన్ని సొసైటి ఏ విధంగా ట్రీట్ చేసింది..ఆయన నిరపరాధి అని, ఎటువంటి తప్పు చేయలేదని ఏ విధంగా నిరూపించారు? నంబిపై నిరాధారమైన కేసు బనాయించి, ఆయనపై దేశద్రోహి అని ముద్ర వేయడానికి ముందు, తర్వాత దేశం కోసం ఆయన ఏం చేశారు? ఆ త్యాగాలు ఏమిటి? ..ఇలా ఆయన జీవితంలో ప‌లు అంశాల‌ని తెర‌పైకి తీసుకొచ్చారు.

విశ్లేషణ..ఇలాంటి బయోపిక్ లు తెరకెక్కించినప్పుడు ఖచ్చితంగా సినిమాటెక్ సన్నివేశాలు చోటు చేసుకున్నా అవి సహజత్వంగా అనిపించగలగాలి. అదే సమయంలో డాక్యుమెంటరీ కాకుండా చూసుకోవాలి. తొలిసారి దర్శకుడుగా మెగా ఫోన్ పట్టుకున్న మాధవన్ ఈ విషయంలో తడపడ్డాడు. సినిమా ఫస్టాఫ్ అంటే సైన్స్ కు సంభందించిన విషయాలు చెప్తూ వెళ్లిపోయారు. సాలిడ్ ఇంజిన్‌, లిక్విడ్ ఫ్యూయ‌ల్ ఇంజిన్‌, క్రయోజ‌నిక్ ఇంజిన్.. వంటి విషయాలు మనకు చాలా వరకు ఆర్దం కాదు. దాంతో చాలా అనాసక్తిగా సినిమా నడుస్తుంది. సెకండాఫ్ లోనే అసలు కథ మొదలు అవుతుంది. ఖచ్చితంగా ఈ కథను ఓ సీనియర్ డైరక్టర్ డీల్ చేసి ఉంటే వేరే విధంగా ఆసక్తిగా చెప్పేవారనటంలో సందేహం లేదు. అయితే సెకండాఫ్ లో సినిమాలో డ్రామా రావటంతో కాస్త గాడిన పడింది. ఎప్పుడైతే నంబి నారాయణ్ ని అరెస్ట్ చేసారతో..ఆ తర్వాత దాన్ని నుంచి ఎలా బయిటపడతారు ఆయన అనేది మనని చివరి దాకా కూర్చో పెడుతుంది. ఎమోషన్స్ కు ఎక్కువ ఇంపార్టెంన్స్ ఇచ్చారు.

ఒక రాకెట్ కూలిపోతే ఎలా రియాక్ట్ అవ్వాలో తెలిసిన మాకు (సైంటిస్ట్‌ల‌కు), ఒక మనిషి కూలిపోతే ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియదేమో” వంటి డైలాగులు హృదయాన్ని ద్రవింపచేస్తాయి. ఓ సైంటిస్ట్ కి ఇచ్చే గౌరవం ఇదేనా అనిపిస్తుంది. రెగ్యులర్ కమర్షియల్ హంగులు జోలికి వెళ్లకుండా నంబి నారాయణన్ జీవితంలో జరిగినది జరిగినట్టు చెప్పాలని మాధవన్ ప్రయత్నించటం ఇక్కడ మెచ్చుకోదగిన అంశం. అలాగే నంబి అరెస్టుకు కారణం ఏమిటనేది సినిమాలో చెప్పలేదు. చాలా నిజాయితీగా ఈ విషయాన్ని ఓ ప్రశ్న రూపంలో వదిలేసారు. సామాన్య ప్రేక్షకుడు అంత‌గా క‌నెక్ట్ కాని అంశాలతో వచ్చిన ఈ సినిమా మరింత సులభంగా అర్దమయ్యేలా స్క్రిప్టు ఉంటే మాధవన్ కష్టానికి సరైన ఫలితం దక్కేదనిపిస్తుంది. అయితే రాకెట్ సైన్స్‌ ని సామాన్యుడుకి అర్దమయ్యేలా రెండున్నర గంటల సినిమాలో చెప్పటం కష్టమే. ఇవన్నీ ప్రక్కన పెడితే కొన్ని సీన్స్ హైలెట్ గా నిలుస్తాయి. ముఖ్యంగా కేసులో ఇరుక్కున్నప్పుడు ఆయన కుటుంబం మానసిక సంఘర్షణ, క్లైమాక్స్ లో హీరో సూర్య చేసే పని సినిమాని నెక్ట్స్ లెవిల్ కు తీసుకెళ్లింది.

టెక్నికల్ … ఈ కథే చాలా టెక్నికల్ అంశాలతో ముడిపడింది. వాటిని పీట ముడిపడకుండా ఒక్కో ముడి విప్పుతూ ఇంట్రస్టింగ్ గా చెప్పాల్సిన అవసరం దర్శకుడుది. ఆ విషయంలో మాధవన్ సగమే సక్సెస్ అయ్యారు. తన దగ్గర ఉన్న మెటీరియల్ మొత్తం తెరకెక్కించాలనే ఆసక్తి, ఆత్రుత కొన్ని సార్లు కనబడుతుంది. తను ఇంజినీరింగ్ స్టూడెంట్ కాబట్టి కొన్ని టెక్నికల్ విషయాలు ఆయనకు అర్దమయ్యాయి. చూసే జనాలు కూడా ఆయనలాగే అర్దమవుతుంది అనుకుని స్క్రిప్టు రాసుకుని తెరకెక్కించారు. ఆ విషయంలో కాస్తంత జాగ్రత్తపడాల్సింది. టెక్నికల్ గా మిగతా క్రాఫ్ట్ లు అన్ని పూర్తి స్దాయి ప్రతిభను కనపడిచారు. మాధవన్ కు సహకరించారు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

న‌టీన‌టులు.. మాధ‌వ‌న్ నటుడుగా ఎప్పుడో నెక్ట్స్ లెవిల్ కు వెళ్లారు. ఈ సినిమాలో మరోసారి అది ప్రూవ్ అయ్యింది. అసలు ప్రాస్థ‌టిక్ మేక‌ప్ లేకుండా మాధ‌వ‌న్ లుక్‌ను మార్చటం ఆశ్చర్యం అనిపిస్తుంది. బ‌రువు పెరుగుతూ.. త‌గ్గుతూ కథను ముందుకు నడిపించటం చూస్తే ఆయన డెడికేషన్ అర్థ‌మ‌వుతోంది. నంబి భార్య పాత్ర‌లో సిమ్రాన్‌, అబ్దుల్ క‌లామ్ పాత్ర‌లో గుల్ష‌న్ గ్రోవ‌ర్ స‌హా ఇత‌ర న‌టీన‌టులంద‌రూ వారి వారి పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. ఇక సినిమాలో గెస్ట్ అప్పియ‌రెన్స్ చేసిన సూర్య‌.. సినిమా కు బాగా ప్లస్ అయ్యారు. ఇక సినిమా జ‌యాప‌జ‌యాలు ప్రేక్ష‌కుల చేతిలో ఉన్నాయి. మొత్తానికి మాధ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వాన్ని చేప‌ట్టారు ఈ చిత్రంతో.

Advertisement

తాజా వార్తలు

Advertisement