Wednesday, September 20, 2023

తెలంగాణలో రోడ్లు, భవనాలకు మహర్దశ.. రాజధానికి మణిహారంలా రీజనల్‌ రింగ్‌ రోడ్డు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో రోడ్లు, రహదారులకు మహర్ధశ పట్టింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడే నాటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రోడ్లు, భవనాల శాఖ పరిధిలో కేవలం 24,245 కి.మీ.ల రోడ్లు మాత్రమే ఉండేవి. అయితే, రాష్ట్రం ఏర్పాటైన తరువాత ప్రభుత్వం రూ.2727 కోట్ల వ్యయంతో 1875 కి.మీ.ల మేర డబుల్‌ రోడ్ల నిర్మాణాన్ని కొత్తగా చేపట్టింది. వీటిలో ఇప్పటికే 1684 కి.మీ.రోడ్ల నిర్మాణం పూర్తి కాగా, మిగతావి చివరి దశలో ఉన్నాయి. అలాగే, రూ.3134 కోట్ల అంచనా వ్యయంతో 717 వంతెనల నిర్మాణం చేపట్టగా వాటిలో దాదాపు 50 అంటే 350 వంతెనల నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. కాగా, జిల్లాలలో పరిపాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వం రూ.1581 కోట్లతో రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో సమీకృత కలెక్టరేట్ల నిర్మాణం చేపట్టింది.

జిల్లాలోని అన్ని విభాగాలను కలుపుతూ నిర్మించిన సమీకృత కలెక్టరేట్ల వల్ల ప్రజలందరికీ ఉన్నతాధికారులందరూ ఒకేచోట కలిసే అవకాశం ఏర్పడింది. తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన కలెక్టరేట్‌ భవనాలు కొన్ని రాష్ట్రాల సచివాలయ భవనాల కన్నా మిన్నగా ఉన్నాయని పలువురు ప్రముఖులు ప్రశంసించడం విశేషం. ఇక ఈ పదేళ్లలో తెలంగాణ అస్థిత్వాన్ని సమున్నతంగా చాటే విధంగా నిర్మితమైన సచివాలయ భవనానికి ప్రభుత్వం బీఆర్‌ అంబేద్కర్‌ పేరును పెట్టడంతో దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురిసింది. అధునాతన వసతులతో 7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 7 అంతస్తుల సచివాలయ భవన నిర్మాణం పూర్తి కాగా, సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభమై రాష్ట్ర ప్రజలకు పరిపాలనను మరింత చేరువ చేసింది.

- Advertisement -
   

అలాగే, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణ త్యాగం చేసిన అమరుల స్మృతిలో ప్రభుత్వం రూ.178 కోట్ల వ్యయంతో హుస్సేన్‌సాగర్‌ తీరాన నిర్మించిన అమరుల స్మారక కేంద్రం త్వరలో ప్రారంభానికి సిద్ధమవుతున్నది. అలాగే, సచివాలయం సమీపంలో సమున్నతంగా 125 అడుగుల ఎత్తుతో నిర్మించిన భారీ అంబేద్కర్‌ విగ్రహం తెలంగాణ ప్రభుత్వ సామాజిక న్యాయ స్ఫూర్తికి ప్రతీకగా నిలచింది. దేశ రాజ్యంగ నిర్మాత అయిన అంబేద్కర్‌ మహనీయుని విగ్రహం యావత్‌ భారత జాతికి గర్వకారణంగా నిలచింది. మరోవైపు, రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నగరానికి మణిహారంలా రీజనల్‌ రింగ్‌ రోడ్డు నిలిచింది. ఆన్ని రంగాలలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌ నగరానికి మణిహారంగా రీజనల్‌ రింగ్‌ రోడ్డు రూపుదిద్దుకుంటున్నది.

హైదరాబాద్‌ నగరానికి సమీపంలో ఉన్న ఉమ్మడి నల్గొండ, మెదక్‌, మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాల ప్రజలు వేల సంఖ్యలో వ్యాపార, వాణిజ్య అవసరాల నిమిత్తం వస్తుంటారు. అయితే, ఈ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజల కారణంగా రాజధాని రోడ్లపై వాహనాల రద్దీతో ట్రాఫిక్‌ సమస్యలు ఎదురవుతున్నాయి. నగరంపై ఈ భారాన్ని తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం రీజనల్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టింది. దీంతో భావి అవసరాలకు సరిపడేలా రోడ్లు రూపుదిద్దుకుంటున్నాయి. రీజనల్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణంతో తెలంగాణ ప్రభుత్వం రాజధాని నగర సమీప ప్రాంతాలలో నివసించే ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement