Friday, March 29, 2024

విదేశీ ప్రయాణికుల ద్వారా రాష్ట్రంలో వైరస్‌ వచ్చే ప్రమాదం.. శరీరంపై బొబ్బలు, దద్దుర్లు కనిపిస్తే ఆసుపత్రికి వెళ్లండి..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: మంకీపాక్స్‌ వైరస్‌ ప్రపంచంలోని పలు దేశాలకు వేగంగా వ్యాపిస్తుండడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. విదేశాలకు వెళ్లి వచ్చిన వారి ద్వారా వైరస్‌ రాష్ట్రంలో వ్యాపించే ప్రమాదం ఉందని అంచనా వేస్తోంది. దాంతో శరీరంపై బొబ్బలు, దద్దుర్లు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఆసుపత్రికి వెళ్లాలని ప్రజలకు , ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చిన వారికి సూచిస్తోంది. ప్రస్తుతం ఆఫ్రికా, యూరప్‌, అమెరికాలోని 20 దేశాల్లో 200కి పైగా మంకీపాక్స్‌ కేసులు నమోదయ్యాయి. మంకీపాక్స్‌ వైరస్‌ ప్రపంచంలోని పలు దేశాలకు వేగంగా వ్యాపిస్తోందని వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ ప్రకటించిన విషయం విధితమే. మంకీపాక్స్‌ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారులను ఇప్పటికే వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ఆదేశించారు. మరోసారి శనివారం ప్రత్యేకంగా మంకీపాక్స్‌ వైరస్‌ రాష్ట్రంలో ప్రవేశం, వ్యాప్తికి గల అవకాశాలపై రాష్ట్ర ప్రజారోగ్యశాఖ డైరెక్టర్‌ డా. జీ. శ్రీనివాసరావు ఆరా తీశారు. ఈ విషయమై జిల్లా వైద్యాధికారులతో ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. మంకీపాక్స్‌ అనుమానిత కేసులు ఏమైనా వెలుగు చూశాయా..? అని అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా విదేశాలకు వెళ్లి వచ్చిన వారి ద్వారా రాష్ట్రంలో మంకీపాక్స్‌ వ్యాపించే ప్రమాదం ఉందని , విదేశీ ప్రయాణికుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెప్పించుకుని వారి ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారులను ఆదేశించారు. విదేశాలకు వెళ్లి వచ్చినవారిలో ఎవరికైనా శరీరంపై దుద్దుర్లు వస్తే వెంటనే వారిని ఐసోలేట్‌ చేయాలని ఆదేశించారు. వారి శాంపిళ్లను సేకరించి పూణేలోని నేషనల్‌ ఇనిస్ట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ ల్యాబ్‌కు పంపాలని సూచించారు. శరీరంపై దద్దుర్లు, చిన్న చిన్న బొబ్బలు కనిపిస్తే విదేశాలకు వెళ్లి వచ్చిన వారు స్వచ్ఛంధంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో టెస్టులు చేయించుకోవాలని, ఏ మాత్రం అనారోగ్యం ఉన్నా వెంటనే వైద్యులతో పరీక్షలు చేయించుకోవాలని కోరారు. మంకీపాక్స్‌ సోకితే జ్వరం , ఒళ్లు నొప్పులు, చలి, అలసట, శరీరంపై దుద్దుర్లు, తీవ్రమైన తలనొప్పి, నీరసం వంటి అనారోగ్య లక్షణాలు బహిర్గతమవుతాయని, ఇలాంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా చికిత్స పొందాలన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement