Saturday, January 4, 2025

Rising Telangana – ఏడో తేదిన న‌ల్గొండ‌లో రేవంత్ ప‌ర్య‌ట‌న

న‌ల్గొండ – ప్రజా ప్రభుత్వం ఏర్పడి ఈ నెల 7వ తేదితో సంవత్సరం నిండుతున్న సందర్బంగా నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలో ఎస్ఎల్బీసీ వద్ద ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాల పక్కన “రాజీవ్ ప్రాంగణం” లో లక్ష మందితో బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఈ నెల ఏడో తేదిన జ‌రిగే ఈ స‌భ‌లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన‌నున్నార‌ని వెల్ల‌డించారు.

ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా సిఎం ప్రారంభించే అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను ,శంఖ‌స్థాప‌న ప్ర‌దేశాల‌ను , స‌భ ఏర్పాట్ల‌ను మంత్రి ప‌రిశీలించారు.. అనంతరం నూతన వైద్య కళాశాల వద్ద మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా ముందుగా సుమారు వేయి కోట్ల రూపాయలతో చేపట్టిన బ్రాహ్మణ వెల్లేముల ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ చానల్స్ ప్రారంభిస్తారని తెలిపారు. 2008 లో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఉదయ సముద్రం ప్రాజెక్టు కింద బ్రాహ్మణ వెల్లేముల రిజర్వాయర్ మంజూరు కాగా, 80% పనులు పూర్తయ్యాయని, అయితే గత ప్రభుత్వ హయాంలో పనులు పూర్తి చేయలేదని ,తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నూటికి నూరు శాతం పనులను పూర్తిచేశామని తెలిపారు. బ్రాహ్మణ వెల్లేముల ద్వారా సుమారు లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుందని ,దీని ద్వారా గ్రౌండ్ వాటర్ పెరుగుతుందని, నార్కెట్ పల్లి వంటి ఫ్లోరైడ్ శాతం ఎక్కువగా ఉన్న మండలానికి బ్రాహ్మణ వెల్లేముల ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు.

పెండింగ్ లో ఉన్న ఎస్ ఎల్ బి సి కి సైతం రాష్ట్రప్రభుత్వం ప్రత్యేకించి రాష్ట్ర ముఖ్యమంత్రి 4540 కోట్ల రూపాయలు పెంచి మంజూరు చేశార‌న్నారు. అమెరికా నుండి బోర్ మిషన్ కు సంబంధించి బేరింగ్ మంజూరు చేయించడం జరిగిందని, 4000 నుండి 6000 క్యూసెక్కుల నీటితో నాలుగు లక్షల ఎకరాలకు ఎస్ఎల్బీసీ ద్వారా సాగునీరు వస్తుందని తెలిపారు. నల్గొండ జిల్లాకు శాశ్వత పరిష్కారం కానున్నదని, శ్రీశైలం డెడ్ స్టోరేజ్ ద్వారా సాగునీటిని తీసుకోవచ్చని తెలిపారు.

- Advertisement -

అనంతరం ముఖ్యమంత్రి యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ లో యూనిట్ -2 ఎనర్జైజేషన్ ప్రారంభం తర్వాత నల్గొండ జిల్లా కేంద్రంలో ఎస్ ఎల్ బి సి గంధం వారి గూడెం వద్ద 275 కోట్ల రూపాయలతో నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాల ను ప్రారంభిస్తారన్నారు. ,అంతేగాక అక్కడే 40 కోట్ల రూపాయలతో నిర్మాణం చేపట్టనున్న నర్సింగ్ కళాశాలకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు. నల్గొండ జిల్లా కేంద్రంలో సెట్విన్ ద్వారా మహిళలకుద్దేశించిన స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాన్నీ ప్రారంభిస్తారని, లైబ్రరీ భవన నిర్మాణానికి శంకుస్థాపన, కంగల్, తిప్పర్తి మండలాలకు జూనియర్ కళాశాలు మంజూరయ్యాయని, వాటికి శంకుస్థాపన చేస్తారని తెలిపారు. అలాగే నార్కెట్పల్లి, దామరచర్ల మండలాలకు డిసెంబర్ 9 తర్వాత జూనియర్ కళాశాలలు మంజూరు చేస్తూ జీఓ రానుందని మంత్రి వెల్లడించారు.

పదికోట్ల రూపాయలతో ఎల్లారెడ్డిగూడెం వద్ద టూరిజం ద్వారా హరిత హోటల్ నిర్మిస్తున్నామని ఆయన తెలిపారు. తమ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 500 రూపాయలకే ఎల్పీజీ సిలిండర్, 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్తు ,మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కింద 3600 కోట్లు ఖర్చు చేయడం జరిగిందని, రుణమాఫీ కింద 25 వేల కోట్ల రైతుల రుణాలు మాఫీ చేశామని, సంక్రాంతి తర్వాత రైతు భరోసాను ముఖ్యమంత్రి ప్రకటించనున్నారని, వచ్చే నెలలో మూసి ప్రక్షాళన కోసం 25 వేల కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచి దశలవారీగా మూసి ప్రక్షాళనచేపట్టనున్నామని తెలిపారు.

నల్గొండలో ఎస్ ఎల్ బి సి గంధం వారిగూడెం మెడికల్ కళాశాల పక్కన ” రాజీవ్ ప్రాంగణంలో” నిర్వహిస్తున్న బహిరంగ సభకు లక్ష మంది ప్రజలు హాజరుకానున్నారని, ప్రజలందరూ స్వచ్చందంగా పెద్ద ఎత్తున వచ్చి ప్రజా పాలన సంవత్సరం పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారూ. రాష్ట్ర ముఖ్యమంత్రి రాక సందర్భంగా ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవాలని ఆయన జిల్లా కలెక్టర్ ,అధికారులను ఆదేశించారు.

మంత్రి వెంట జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం ,మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ రాములు నాయ క్, వైద్య కళాశాల ప్రిన్సిపల్ శ్రీవాణి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి పుట్ల శ్రీనివాస్,ఆర్డీవో అశోక్ రెడ్డి,డి ఎస్ పి శివారాం రెడ్డి, తదితరులు ఉన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement