Friday, November 8, 2024

RHUMI 1 – తిరిగొచ్చే రాకెట్ ప్ర‌యోగం స‌క్సెస్..

రూమీ 1 పేరుతో పునర్వినియోగ హైబ్రిడ్‌ రాకెట్‌
రూపొందించిన స్పేస్ జోన్ సంస్థ‌
నేడు త‌మిళ‌నాడు నుంచి ప్ర‌యోగం
చిన్న చిన్న ఉప‌గ్ర‌హాల‌ను క‌క్ష్య‌లోకి ప్ర‌వేశం
పారాచూట్ల స‌హాయంతో రాకెట్ శ‌క‌లాలు తిరిగి భూమికి
తొలిసారి చేసిన ప్ర‌యోగం గ్రాండ్ స‌క్సెస్

చెన్నై: దేశంలో తొలిసారిగా పునర్వినియోగ హైబ్రిడ్‌ రాకెట్ ప్రయోగం శనివారం నిర్వ‌హించారు. చెన్నై ఈసీఆర్‌లోని తిరువిడందై తీర గ్రామం నుంచి రూమీ-1 పేరుతో నిర్మించిన ఈ చిన్న రాకెట్‌ ఈ ఉదయం నింగిలోకి దూసుకెళ్లింది. స్పేస్‌జోన్‌ ఇండియా రూపొందించిన 80 కిలోల బరువున్న ఈ రాకెట్‌ను హైడ్రాలిక్‌ మొబైల్‌ కంటైనర్‌ లాంచ్‌పాడ్‌పై నుంచి ప్రయోగించారు. ఇది కిలోకన్నా తక్కువ బరువున్న మూడు క్యూబ్‌ ఉపగ్రహాలు, 50 పికో శాటిలైట్లను మోసుకుని ఉప కక్ష్య పథంలోకి దూసుకెళ్లింది. అనుకున్న విధంగా ఉప‌గ్ర‌హాల‌ను క‌క్ష్య‌లోకి ఈ రాకెట్ ప్ర‌యోగించింది. వాతావరణ పరిస్థితులు, కాస్మిక్‌ రేడియేషన్, యూవీ రేడియేషన్, గాలి నాణ్యత తదితరాల్ని క్యూబ్‌ ఉపగ్రహాలు సేకరించనున్నాయి. నింగిలో కంపనస్థాయి, ఓజోన్‌ పొర పరిస్థితిని, ఇతర పర్యావరణ పరిస్థితుల్ని పికో ఉపగ్రహాలు గుర్తించనున్నాయి.

- Advertisement -

పునర్వినియోగం ఇలా..

కంటైనర్‌ తరహా మొబైల్‌ లాంచ్‌పాడ్‌ నుంచి ప్రయోగించిన తర్వాత భూఉప కక్ష్యలోకి ఉపగ్రహాలు వెళ్లేలా రాకెట్ పైకెళ్లింది. అక్కడికి వెళ్లేలోపు శకలాలు తిరిగి భూమికి చేరేలా రాకెట్‌లోనే పారాచూట్లను ఉంచారు. నిర్ణీత దూరం వరకు వెళ్లాక.. శకలాలు కిందకు జారి, భూమికి కొంత ఎత్తుకు చేరేసరికి పారాచూట్లు తెరచుకొని సురక్షితంగా దిగడం దీని సాంకేతికత. సెన్సార్ల సాయంతో ఆ శకలాల్ని సేకరించి తిరిగి మరో రాకెట్ వినియోగానికి వాడతారు. తద్వారా ప్రయోగ ఖర్చు బాగా తగ్గుతుందని స్పేస్‌జోన్‌ ఇండియా సీఈవో ఆనంద్‌ మేఘలింగం గతంలో తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement