Thursday, April 25, 2024

టాప్‌ 3 ఐటీ కంపెనీల్లో తగ్గిన నియామకాలు.. క్యూ3లో కేవలం 5వేల ఉద్యోగాలు

దేశంలోని టాప్‌ 4 ఐటీ కంపెనీల్లో 3వ త్రైమాసికంలో ఉద్యోగ నియామకాలు భారీగా పడిపోయాయి. రెండో త్రైమాసికం నుంచే ఉద్యోగ నియామకాలను చాలా కంపెనీలు తగ్గించాయి. ఆర్ధిక మాంద్యం భయాలు, రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధం, ద్రవ్యోల్బణం వంటి అనేక కారణాల వల్ల ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ కూడా నెమ్మదించింది. ప్రధానంగా అమెరికా, ఐరోపా దేశాల అర్ధిక వృద్ధిరేటు గణనీయంగా పడిపోవడం వంటి కారణాలతో ఐటీ కంపెనీలు ఖర్చు తగ్గించుకునే పనిలోపడ్డాయి. ఇందులో భాగంగా ఉన్న ఉద్యోగులను తొలగించడం, కొత్త నియామకాలు చేపట్టకుండా ఉండటం వంటి వ్యూహాలను అనుసరిస్తున్నాయి. మూడో త్రైమాసికంలో టాప్‌ 4 ఐటీ కంపెనీలు కేవలం 5 వేల మంది ఉద్యోగులను మాత్రమే తీసుకున్నాయి. ఈ నాలుగు కంపెనీలు మొదటి త్రైమాసికంలో 28,836 మంది ఉద్యోగులను తీసుకున్నాయి. 2022 డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో పరిస్థితి మరీ దారుణంగా మారిపోయింది.

- Advertisement -

టీసీఎస్‌, విప్రో ఐటీ కంపెనీల్లో ఉన్న ఉద్యోగులే తగ్గారు. టీసీఎస్‌లో గత త్రైమాసికంతో పోల్చితే 2,197 మంది ఉద్యోగులు తగ్గారు. విప్రోలో 500 మంది ఉద్యోగులు తగ్గారు. మరో ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్‌లో ఈ త్రైమాసికంలో 1,600 మంది ఉద్యోగులను తీసుకున్నారు. హెచ్‌సీఎల్‌లో 2,945 మందిని తీసుకున్నారు. మొదటి త్రైమాసికంలో చాలా మంది నిపుణులైన ఉద్యోగులను బయటి నుంచి తీసుకున్నామని, పెద్ద సంఖ్యలో కొత్తవారిని ఉద్యోగంలోకి తీసుకున్నామని విప్రో సీఈఓ థియరీ డెలాపోర్టే చెప్పారు. మూడో త్రైమాసికం వచ్చే సరికి ఆర్ధిక వ్యవస్థలు మందగించడంతో దాదాపు నియామకాలు నిలిపివేశామని చెప్పారు. విప్రోలో ఉన్న ఫ్రెషర్స్‌ సంఖ్య సంతృప్తికరంగానే ఉందని చెప్పారు. కంపెనీ ఫ్రెషర్స్‌పై పెట్టుబడి పెట్టాలనుకుంటుందని తెలిపారు. విప్రోలో ఫ్రెషర్స్‌ కల్చర్‌ తక్కువ. ఇప్పుడు కొన్ని త్రైమాసికాలుగా దాన్ని మెరుగుపరుస్తున్నామని తెలిపారు.

2008-09 సంవత్సరాల్లో వచ్చిన ఆర్ధిక సంక్షోభం కాలం నాటి పరిస్థితులే ప్రస్తుతం ఐటీ కంపెనీలు ఎదుర్కొంటున్నాయని, దీని వల్లే కొత్తగా నియామకాలు చేపట్టడంలేదని ఐటీ కన్సల్టెంట్‌ ప్రకాష్‌ జై న్‌ అభిప్రాయపడ్డారు. కరోనా తరువాత భారీగా డిమాండ్‌ పెరగడంతో ఐటీ కంపెలు పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తీసుకున్నాయని ఆయన తెలిపారు. అదే సమయంలో నిపుణులైన చాలా మంది ఉద్యోగులు స్టార్టప్‌లు ప్రారంభిచడం, లేదా వాటిల్లో చేరడం జరిగిందని చెప్పారు. ఈ కారణంతోనే ఉద్యోగం మానివేసిన వారి సంఖ్య కూడా గణనీయంగా ఉందన్నారు. ప్రస్తుతం ఈ రెండు పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని అందుకే ఐటీ కంపెనీలు ఉద్యోగ నియామకాలు దాదాపు నిలిపివేసినట్లు అభిప్రాయపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement