Wednesday, April 24, 2024

ఆర్‌ఆర్‌ఆర్‌ కలెక్షన్స్‌లా ఎగుమతుల్లో రికార్డు.. భారత్‌ సరికొత్త చరిత్ర..

2021-22లో భారతదేశ సరుకుల ఎగుమతులు రికార్డు స్థాయిలో 418 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయని, ఈ ఘనత సాధించినందుకు సంతోషంగా ఉందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ అన్నారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, రైతులతో ప్రభుత్వం ఐక్యంగా పని చేయడంతోనే ఇది సాధ్యమైందని చెప్పుకొచ్చారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో పెట్రోలియం ఉత్పత్తులు, ఇంజినీరింగ్‌ వస్తులు, రత్నాలు, ఆభరణాలతో పాటు రసాయనాలు విదేశాలకు ఎగుమతి అయినట్టు తెలిపారు. వీటి ఎగుమతులు.. రికార్డు స్థాయికి చేరేందుకు సహకరించాయని వివరించారు. 2021-22లో నెలవారీ ప్రాతిపదికన.. 20 బిలియన్‌ డాలర్లు విలువైన ఎగుమతులు సాధించామన్నారు. దేశంలో రెండో, మూడో వేవ్‌ కరోనా వైరస్‌ మహమ్మారి తీవ్రంగా ఉన్నప్పటికీ.. ఇది సాధ్యమైందని చెప్పుకొచ్చారు. వాస్తవానికి ఎగుమతులు మార్చి 2022లో ఆల్‌ టైమ్‌ నెలవారీ గరిష్ట స్థాయి 40 బిలియన్‌ డాలర్లను తాకినట్టు తెలిపారు. మార్చి 23నే ఈ ఘనత సాధించినట్టు వివరించారు.

ఆర్‌ఆర్‌ఆర్‌ తరహాలో రికార్డు..

భారత్‌ నుంచి అత్యధికంగా అమెరికా, యూఏఈ, చైనా, బంగ్లాదేశ్‌తో పాటు నెదర్లాండ్స్‌కు వస్తువులు ఎగుమతి అయినట్టు పీయూష్‌ గోయల్‌ వివరించారు. ఎంఎస్‌ఎంఈ రంగం, ఎగుమతిదారులు, రైతులందరూ కలిసి భారతదేశాన్ని విజయవంతంగా కొత్త శిఖరాలకు తీసుకెళ్లారని కొనియాడారు. హిందీ-తెలుగు ద్విభాషా చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాను గోయల్‌ ఉదాహరణగా చెప్పారు. భారతీయ సినిమా చరిత్రలోనే అత్యధికంగా రూ.750 కోట్ల వ్యాపారం చేసిందన్నారు. భారతీయ ఆర్థిక వ్యవస్థ కూడా అన్ని రికార్డులు బద్దలు కొట్టడానికి సిద్ధంగా ఉందన్నారు. అసాధ్యమైన లక్ష్యాలను సాధింగల సత్తా భారతదేశానికి ఉన్నందున.. ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలాగే.. భారతీయ ఆర్థిక వ్యవస్థ రికార్డు స్థాయికి చేరుకుంటుందని చెప్పుకొచ్చారు. ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం కారణంగా ప్రపంచ సప్లై చైన్‌ అంతరాయం ఏర్పడినప్పటికీ.. షిప్పింగ్‌ ఖర్చులు ఆకాశాన్ని అంటుతున్నప్పటికీ.. భారతదేశం మార్చి 2022లో నెలవారీ ఎగుమతి అత్యధికంగా 40 బిలియన్‌ డాలర్ల ఎగుమతిని సాధించగలిగిందని తెలిపారు. 2019-20లో గోధుమ ఎగుమతులు 2 ఎల్‌ఎంటీ ఉండగా.. 2021-22లో అది 70 ఎల్‌ఎంటీకి చేరుకుందని, దేశీయ వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతి పెంచడంలో సహకరించిన రైతులకు గోయల్‌ ధన్యవాదాలు తెలియజేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement