Sunday, December 4, 2022

ఐటీ ఉద్యోగుల్లో మాంద్యం ఫియర్‌.. గ్లోబల్‌ టెక్‌ దిగ్గజాల లే ఆఫ్‌లతో పెరుగుతున్న భయాందోళనలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఆర్థిక మాంద్యం రానుందన్న భయాలతో ప్రపంచవ్యాప్తంగా టెక్‌ రగంలోని దిగ్గజాలు తమ కంపెనీల్లోని వేలాది మంది ఉద్యోగులను మూకుమ్మడిగా తొలగిస్తున్నాయి. ఈ ప్రభావం ఇక్కడి ఐటీ ఉద్యోగులపైనా పడుతోంది. అమెరికాలో మొదలైన మాంద్యం పరిస్థితులు ఇక్కడిదాకా వస్తే తమ పరిస్థితేంటని రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగులు భయాందోళనలకు గురవుతున్నారు. గతంలో వచ్చిన గ్లోబల్‌ ఫైనాన్షియల్‌ క్రైసిస్‌ లాంటి సంక్షోం మళ్లి వస్తే ఏం చేయాలనేదానిపై వారు తర్జన భర్జన పడుతున్నారు. ఇప్పటికే ఇక్కడి ఐటీ రంగంలోని కొన్ని కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకునే ప్రయత్నాలు ప్రారంభించినట్లు ఉద్యోగులు చెబుతున్నారు. స్కిల్‌ అప్‌ గ్రేడేషన్‌ పేరుతో కంపెనీలు గత ఐదు సంవత్సరాల్లో తీసుకున్న కొత్త ఉద్యోగులకు ప్రత్యేక పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరీక్షలో కనీస మార్కులు సాధిస్తేనే ఉద్యోగులను కొనసాగించే దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నాయని సమాచారం. అయితే ఈ పరీక్షలన్నీ కేవలం కుంటిసాకులని మాంద్యం పరిస్థితుల నేపథ్యంలోనే కంపెనీలు ముందు జాగ్రత్త పడుతున్నాయని పలువురు ఐటీ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

టెక్‌ దిగ్గజాలకు మాంద్యం భయం…

- Advertisement -
   

ఆర్థిక మాంద్యం, ఇతర మార్కెట్‌ ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో దిగ్గజ ఐటీ కంపెనీలు వేలల్లో ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. ట్విట్టర్‌, మెటా(ఫేస్‌బుక్‌), అమెజాన్‌ వంటి సంస్థల్లో ఆందోళనకర స్థాయిలో ఈ ఉద్యోగుల తొలగింపు జరుగుతోంది. ఈ కంపెనీల బాటలోనే త్వరలో మరికొన్ని కంపెనీలు కూడా నడవనున్నట్లు చెబుతున్నారు. మరో కంపెనీ హెచ్‌పీ కూడా 2025 నాటికి 4-6 వేల మందిని తొలగిస్తామని తాజాగా ప్రకటించింది. ఆర్థిక మాంద్యం భయాలు, మార్కెట్‌ ఒడిదొడుకులు, ఆదాయ క్షీణత కారణంగానే ఉద్యోగులను తొలగిస్తున్నట్లు కంపెనీలు చెబుతున్నాయి.

అమెరికాలో ఉద్వాసనకు గురవుతున్న హెచ్‌-1 బీ వీసాహోల్డర్లు…

ఇటీవల ఎలాన్‌ మస్క్‌ ట్విట్టర్‌ను చేజిక్కించుకున్న తర్వాత అమెరికాలో ఉద్యోగాల ఊచకోత మొదలైంది. ట్విట్టర్‌ బాటలోనే చాలా టెక్‌ కంపెనీలు పయనిస్తున్నాయి. దీంతో ఇక్కడి నుంచి హెచ్‌-1 బీ వీసాల మీద వెళ్లిన నిపుణులు ఉద్యోగాలు లేక ఖాళీ అవుతున్నారు. వీరికి ఏదో ఒక ఉద్యోగంలో ఉండడం చాలా ముఖ్యం. లేదంటే వీసా రద్దయ్యే ప్రమాదముంటుంది. ప్రస్తుతం వీరందరిని భారత్‌కు చెందిన ఐటీ కంపెనీలు తమ అమెరికా కార్యాలయాల్లో వారి గత వేతనాల కన్నా తక్కువ వేతనాలకు నియమించుకుంటున్నాయి. దీంతో అటు హెచ్‌-1 వీసా హోల్డర్లకు వెంటనే కొత్త ఉద్యోగాలు, ఇటు ఇక్కడి కంపెనీలకు తక్కువ వేతనాల్లోనే నిపుణులు లభ్యమయ్యే పరిస్థితిని మాంద్యం తీసుకువచ్చిందని పలు హెచ్‌ఆర్‌ కన్సల్టెన్సీలు విశ్లేషిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement