Saturday, September 7, 2024

Delhi | కేబినెట్ నిర్ణయంతో అన్నదాతలకు భరోసా.. మద్దతు ధర పెంపుపై ప్రధానికి కృతజ్ఞతలు : కిషన్ రెడ్డి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: అన్నదాతల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడిందని, ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు రైతు ఆదాయాన్ని పెంచే దిశగా మరో అడుగు ముందుకేసిందని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ పంటల మద్దతు ధరను పెంచుతూ నిర్ణయం తీసుకోవడం పట్ల కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. 2023-24 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ నుంచి ఈ మద్దతు ధర అందుబాటులోకి వస్తుందని, తద్వారా రైతులకు అండగా నిలవడంతోపాటు.. భిన్నమైన పంటలు పండించేలా (క్రాప్ డైవర్సిఫికేషన్) రైతులను ప్రోత్సహించేందుకు ధరల పెంపు ఉపయోగపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

కేంద్ర ప్రభుత్వం సమయానుగుణంగా కనీస మద్దతు ధర పెంచుతున్న కారణంగా తెలంగాణ రైతులకు ఎంతో మేలు జరిగిందని కేంద్రమంత్రి పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో పండే పంటల్లో 2014తో పోలిస్తే.. 60% నుంచి 80% వరకు కనీస మద్దతు ధర పెరిగిందని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. గరిష్టంగా సన్ ఫ్లవర్ (పొద్దుతిరుగుడు పువ్వు)కు 2014 ధరలతో పోల్చితే 80 శాతం పెరిగిందని, తెలంగాణలోని పత్తి రైతులను ప్రోత్సహించడంతోపాటు.. తెలంగాణలోని చేనేత పరిశ్రమకు అండగా నిలిచేందుకు పత్తి మద్దతు ధరను 75% వరకు పెంచిందని కేంద్రమంత్రి పేర్కొన్నారు. వరితో పాటు మొక్కజొన్న, సోయా వంటి పంటలకు కనీస మద్దతు ధర 50 శాతం మేర పెరిగిన విషయాన్ని కిషన్ రెడ్డి గుర్తుచేశారు.

- Advertisement -

రైతులు తమ పంట సాగుపై చేసే ఖర్చుకంటే 50 శాతం నుంచి 80 శాతానికి పైగా కనీస మద్దతు ధర ఉందని తెలిపారు. సజ్జలపై పండించిన ధరకంటే 82 శాతం ఎక్కువగా, కందిపప్పుపై 58 శాతం, సోయాపై 52 శాతం, మినుపులపై 51 శాతం ఎక్కువగా కనీస మద్దతు ధరను నిర్ణయించారని కిషన్ రెడ్డి తెలిపారు.. ఇతర పంటలపై పండించిన ధరకంటే కనీసం 50 శాతం కంటే ఎక్కువగా ఉందని తెలిపారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement