Friday, March 29, 2024

రైల్వే పోస్టులకు ప్రతిఫలంగా స్థిరాస్తులు.. బ‌య‌ట‌ప‌డుతున్న లాలూజీ లీలలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఇప్పటికే దాణా కుంభకోణంలో జైలు శిక్ష అనుభవిస్తున్న బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌ను పాత నేరాలు వెంటాడుతున్నాయి. 2004-2009 మధ్యకాలంలో యూపీఏ ప్రభుత్వంలో రైల్వే మంత్రిగా పనిచేసిన లాలూ, రైల్వే శాఖలోని గ్రూప్-డీ పోస్టులను అమ్ముకున్నారన్న ఆరోపణలపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ మేరకు లాలూతో పాటు మరో 15 మందిపై కేసులు నమోదు చేసి, ఏకకాలంలో 16 ప్రాంతాల్లో సోదాలు చేపట్టింది. రైల్వేలో గ్రూప్-డి పోస్టుల నియామకాలు జరిపినందుకు ప్రతిఫలంగా వారి నుంచి స్థిరాస్తి రూపంలో ముడుపులు తీసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. స్థిరాస్తులను లాలూ కుటుంబ సభ్యుల పేర్ల మీద, వారు నిర్వహిస్తున్న కంపెనీల పేర్ల మీద బదలాయింపు చేశారని తెలుస్తోంది. ఎలాంటి ప్రకటన, పబ్లిక్ నోటీసు లేకుండా నియామకాలు చేపట్టినట్టు సీబీఐ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది.

పాట్నాకు చెందిన అనేకమందికి ముంబై, జబల్‌పూర్, కోల్‌క్తా, జైపూర్, హాజీపూర్ లలో వేర్వేరు రైల్వే జోన్లలో ఉద్యోగ నియామకాలు జరిపి, వారి దగ్గర నుంచి స్థిరాస్తుల రూపంలో ముడుపులు తీసుకున్నట్టు వెల్లడైంది. ఈ నియామకాలకు ప్రతిఫలంగా 1,05,292 చదరపు అడుగుల స్థిరాస్తులను లాలూ కుటుంబ సభ్యులు పొందినట్టు పేర్కొంది. 5 సేల్ డీడ్లు, 2 గిఫ్ట్ డీడ్లను ఇప్పటికే గుర్తించగా దర్యాప్తులో మరికొన్ని బయటపడే అవకాశం ఉంది. ఢిల్లీ, పాట్నా, బిహార్‌లోని గోపాల్‌గంజ్ ప్రాంతాల్లో సీబీఐ సోదాలు జరిపినట్టు ప్రకటనలో పేర్కొంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement