Thursday, April 18, 2024

డెల్టా కంటే.. రీ ఇన్‌ఫెక్షన్‌ ఎక్కువే.. ఒమిక్రాన్‌ వ్యాప్తి అధికం..

న్యూఢిల్లీ : ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్‌ కేసులు భారీగా పెరుగుతున్నాయి. అన్ని వేరియంట్‌ల కంటే ఒమిక్రాన్‌ ఎంతో ప్రమాదకరమని అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రపంచ వైద్య ఆరోగ్య శాఖ కూడా ఇదే చెబుతోంది. ఇప్పటికే ఆందోళనకర వేరియంట్‌గా డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొంది. అయితే రీ ఇన్‌ఫెక్షన్‌ ముప్పు డెల్టా, బీటా వేరియంట్లతో పోలిస్తే.. ఎంతో ఎక్కువగా ఉంటుందని తాజాగా సింగపూర్‌ ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్‌ వేరియంట్‌పై విస్తృతంగా అధ్యయనాలు కొనసాగుతున్నాయని తెలిపింది. అన్ని చోట్ల ఆందోళనకరమైన విషయాలే వెలుగులోకి వస్తున్నాయని వెల్లడించింది. గత వేరియంట్‌ల కంటే ఎంతో ప్రమాదకరమైంది.. ఎంతో ఇన్‌ఫెక్షన్‌తో కూడుకున్నది. కరోనా నుంచి కోలుకున్నవారు కూడా ఒమిక్రాన్‌తో రీ ఇన్‌ఫెక్షన్‌ బారినపడే అవకాశాలు ఎక్కువ అని తెలిపింది. అయితే ఒమిక్రాన్‌పై అధ్యయనాలు కొనసాగుతున్నందున.. ఇప్పుడే దీని తీవ్రత, ప్రాణ నష్టంపై అంచనా వేయలేమని వివరించింది. ఇంకా ఎన్నో అంశాలు వెలుగులోకి రావాల్సిన అవసరం ఉందని తెలిపింది.

అయితే ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ జోరుగా సాగుతోందని సింగపూర్‌ ఆరోగ్య శాఖ వివరించింది. అయితే ఏ టీకా ఒమిక్రాన్‌పై సమర్థవంతంగా పని చేస్తుందో ఇంకా తెలియరాలేదని వెల్లడించింది. దీనిపై ఇంకా క్లినికల్‌ ట్రయల్స్‌ కొనసాగుతూనే ఉన్నాయని తెలిపింది. రెండు డోసులు తీసుకున్నా.. ఒమిక్రాన్‌ బారినపడ కుండా ఉండలేమని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న టీకాలు కొంత మేర పని చేస్తాయని, వేరియంట్‌ను అడ్డుకునే శక్తి, సామర్థ్యాలు ప్రస్తుతం ఉన్న టీకాలకు లేదని వివరించింది. గత వేరియంట్‌తో పోలిస్తే.. లక్షణాల్లో కొన్ని మార్పులు ఉన్నాయని తెలిపింది. స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని, మరణాలు అయితే ఇప్పటి వరకు సంభవించలేదని చెప్పుకొచ్చింది. ఒమిక్రాన్‌ వేరియంట్‌ గురించి పూర్తి సమాచారం తెలుసుకునేంత వరకు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. మాస్క్‌, సామాజిక దూరం వంటివి పాటించాలని, ఇదే వైరస్‌ వ్యాప్తిని నిరోధిస్తుందని తెలిపింది. సింగపూర్‌లో ఆదివారం మరో అనుమానిత కేసు నమోదైందని, బాధిత మహిళ దక్షిణాఫ్రికా నుంచి వచ్చినట్టు గుర్తించామని వివరించింది. ఇప్పటి వరకు 3 అనుమానిత కేసులు రికార్డయినట్టు సింగపూర్‌ ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement