ద్రవ్య లభ్యత పెంచేందుకు బ్యాంక్‌లకు ఆర్బీఐ 1.1 లక్ష కోట్లను సమకూర్చింది. ఒకే రోజులో ఇంత పెద్ద మొత్తాన్ని సమకూర్చడం 4 సంవత్సరాల్లో ఇదే తొలిసారి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది సరిపోదని బ్యాంకింగ్ నిపుణులు అభిప్రాయపడ్డారు. ద్రవ్య నియంత్రణ చర్యలు తీవ్ర స్థాయిలో తీసుకుంటున్న ఈ సమయంలో ఇది చాలా తక్కువని వీరు అభిప్రాయపడుతున్నారు. ఫిబ్రవరి 24 నాటికి ఆర్బీఐ లెక్కల ప్రకారం మొత్తం డిపాజిట్లు 178.6 లక్షల కోట్లుగా ఉన్నాయి. వీటితో పోల్చితే 1.1 లక్షల కోట్లు కేవలం 0.6 శాతం మాత్రమే.
2018 అక్టోబర్‌లో ఇది 1.5 శాతంగా ఉందని మార్కెట్ వర్గాలు తెలిపాయి. కరోనా సమయంలో సంస్థలు ఆర్బీఐ రూపొందించిన ఎల్‌టీఆర్‌ఓ విండో ద్వారా 1100 రోజులకు రుణాలు తీసుకున్నాయి. ఇప్పుడు చెల్లింపులు కోసం వస్తున్నందున బ్యాంక్‌ల వద్ద లిక్విడిటీ కొరత ఏర్పడేందుకు కారణమని బాండ్ మార్కెట్ నిపుణుడు ఒకరు స్పష్టం చేశారు. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని చూస్తే ఆర్బీఐ సమకూర్చిన 1.1 లక్షల కోట్లు నగదు సరిపోదని అభిప్రాయపడ్డారు.