Thursday, April 18, 2024

గర్భిణీలు, బాలింతలకు ఇక ఇంటికే రేషన్‌.. వచ్చే నుండి లబ్ధిదారులకు ముడి సరుకులు

అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్ర వ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారాన్ని ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. సంపూర్ణ పోషణ, సంపూర్ణ పోషణ ప్లస్‌ పథకాల ద్వారా లబ్దిదారులకు బలమైన పౌష్టికాలను సరఫరా చేస్తోంది. కాగా గత కొంతకాలంగా ఈ పౌష్టికాహార పంపిణీని ప్రభుత్వం నిలిపివేసి గర్భిణీలు, బాలింతలకు అంగన్‌వాడీ కేంద్రాల్లోనే మధ్యాహ్న భోజన పథకం ద్వారా అందిస్తోంది. అయితే, అంగన్‌వాడీ కేంద్రాల్లో భోజనం చేసేందుకు లబ్ధిదారుల నుండి సరైన స్పందన రాలేదు. గర్భిణీలు, బాలింతలు తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి అధికార యంత్రాంగం ద్వారా తీసుకొచ్చారు. దీంతో ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పౌష్టికాహార పంపిణీ కార్యక్రమంపై లబ్దిదారుల అభిప్రాయ సేకరణ చేపట్టింది.

టేక్‌ హోం రేషన్‌ ద్వారా నేరుగా ముడి సరుకులను అందించాలా.. లేక కేంద్రాల్లో భోజనానికి వస్తారా అన్న అంశంపై సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో 80 శాతానికిపైగా లబ్దిదారులు స్టేక్‌ హోం రేషన్‌ విధానానికే మొగ్గు చూపారు. దీంతో గతంలో కోవిడ్‌ సమయంలో నేరుగా పౌష్టికాలను లబ్దిదారులకు ఏ విధంగా పంపిణీ చేశారో ఇప్పుడు అదే విధంగా పంపిణీ చేయాలన్న నిర్ణయాన్ని తీసుకుంది. దీనికి సంబంధించి గెజిట్‌ నోటిఫికేషన్‌ కూడా ఇచ్చినప్పటికీ ఇప్పటివరకూ ఈ విధానం అమలు కాలేదు. వాస్తవంగా ఈనెల 1వ తేదీ నుండే టేక్‌ హోం రేషన్‌ కార్యక్రమం ప్రారంభం కావల్సి ఉన్నా టెండర్ల ప్రక్రియ ఇతర అంశాలు ఒక కొలిక్కి రాకపోవడంతో ఇదికాస్తా వాయిదా పడింది.

- Advertisement -

జులై 1 నుండి టేక్‌ హోం రేషన్‌ను ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ప్రతి నెలా రెండు విడతలుగా పౌష్టికాలను పంపిణీ చేయాలని ఉత్తర్వుల్లో మహిళా శిశు సంక్షేమ శాఖ స్పష్టంచేసింది. ప్రతి నెలా 1 నుండి 5 తేదీల్లోగా మొదటి విడతగా బియ్యం, కందిపప్పు, కోడిగుడ్లు, నూనె, పాలు, రాగి పిండి, అటుకులు, బెల్లం చిక్కీలు, ఎండు ఖర్జూరం గర్భిణీలు, బాలింతలకు అందించాలని ఉద్దేశించింది. అదేవిధంగా రెండో విడతగా 16, 17 తేదీల్లో పాలు, కోడిగుడ్లు అందించాలని స్పష్టం చేసింది. గతంలో జొన్న పిండిని లబ్దిదారులకు పంపిణీ చేసేవారు. అయితే ఇప్పుడు దానికి బదులుగా రాగి పిండిని అందించనున్నారు.

ఇదిలా ఉంటే చిన్నారులకు యథావిధిగా అంగన్‌వాడీ కేంద్రాల్లోనే మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వంటకు ఎదురవుతున్న ఇబ్బందులను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం ఆసామగ్రి కొనుగోలు రూ. 23.62 కోట్లను విడుదల చేసింది. అంగన్‌వాడీ కేంద్రాల్లో ఈ నిధులతో స్టవ్‌లు, కుక్కర్లు, వంట పాత్రలు కొనుగోలు చేయాలని శిశు సంక్షేమ శాఖ పేర్కొంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో అంగన్‌వాడీ ఆయాలు, సిబ్బంది ఎదుర్కొంటున్న వంట సమస్యకు పరిష్కారం లభించనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement