Saturday, April 20, 2024

శ్రీలంక ప్రధానిగా రణిల్‌ విక్రమసింఘే.. అధ్యక్షడు గొటబాయతో చర్చలు ఫలప్రదం..

కొలంబో:ఆర్థికసంక్షోభం, అశాంతి రాజ్యమేలుతున్న శ్రీలంకకు నూతన ప్రధానిగా యునైటెడ్‌ నేషనల్‌ పార్టీ (యూఎన్‌పీ) అధినేత, 73 ఏళ్ల మాజీ ప్రధాని రణిల్‌ విక్రమసింఘే గురువారం రాత్రి బాధ్యతలు స్వీకరించారు. రణిల్‌తో రెండు దఫాలుగా జరిగిన చర్చలు ఫలప్రదమైన నేపథ్యంలో ప్రధానిగా నియమిస్తున్నట్లు గురువారం అధ్యక్షుడు గొటబాయ ప్రకటించారు. అనంతరం సాయంత్రం6.30 గంటలకు గొటబాయ సమక్షంలో ఆయన బాధ్యతలు స్వకరించారు. 225మంది సభ్యుల పార్లమెంట్‌లో ఒకే ఒక్క స్థానం ఉన్న యూఎన్‌పీకి ప్రధాని పదవి ఇవ్వడం ఆశ్చర్యం గొలుపుతోంది. గతంలో నాలుగు పర్యాయాలు ప్రధానిగాను, మరో మూడు పర్యాయాలు ప్రధాన ప్రతిపక్షనేతగాను బాధ్యతలు నిర్వహించిన రణిల్‌ అనుభవం ఈ సంక్షోభం వేళ అక్కరకొస్తుందని గొటబాయ భావించారు. అదీగాక ఒకే ఒక్క ఎంపీ బలమున్న ఆయన స్వతంత్రంగా వ్యవహరించే వీలుండదను కనుక తన పెత్తనం కొనసాగుతుందన్న ధీమా కూడా కలిగింది. మరోవైపు ప్రధాన ప్రతిపక్షం సహా ఇతర రాజకీయ పక్షాలు ప్రభుత్వంఏర్పాటుకు కలసిరాకపోవడంతో రణిల్‌కు ప్రదాని పదవి ఇవ్వడం అనివార్యమైంది. కాగా అధికార శ్రీలంక పొదుజన పెరమున (ఎస్‌ఎల్‌పీపీ), ప్రధానప్రతిపక్షం సమజి జన బలవెగయకు చెందిన ఒక వర్గం రణిల్‌కు మద్దతు ఇవ్వనున్నారు. ఫలితంగా పార్లమెంట్‌లో మెజారిటీ నిరూపించుకోవడానికి ఎటువంటి సమస్య ఉండదు. ప్రధాని పదవికి మహింద రాజపక్స రాజీనామా చేసిన అనంతరం అధ్యక్షుడు గొటబాయ స్పందిస్తూ అతి త్వరలోనే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని, పార్లమెంట్‌కు మరిన్ని అధికారాలు సంక్రమించేలా చర్యలు తీసుకుంటానని ప్రకటించిన నేపథ్యంలో రణిల్‌ రంగంలోకి వచ్చారు. ప్రధానిగా రణిల్‌ను నియమిస్తూ రాజపక్సే ఆదేశాలు జారీ చేశారు. ప్రజలందరి తరపున ప్రాతినిధ్యవహించేలా కొత్త మంత్రిమండలిని కూడా నియమిస్తామని గొటబాయ నిన్న జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో పేర్కొన్న విషయం తెలిసిందే. ప్రస్తుతానికి రాజకీయ సంక్షోభంనుంచి గొటబాయ గట్టెక్కినట్టేనని భావిస్తున్నారు. అయితే ఆర్థిక సంక్షోభం మాత్రం రోజురోజుకు తీవ్రమవుతోంది.

కొనసాగుతున్న ఆందోళనలు

దేశంలో రాజకీయ పరిణామాలు చకచకా మారుతున్నప్పటికీ ప్రజల ఆగ్రహం చల్లారడం లేదు. గురువారం కూడా దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగాయి.అయితే కొద్ది గంటలపాటు కర్ఫ్యూను సడలించడంతో ప్రజలు బయటకు వచ్చారు. నిత్యావసరాలు కొనుక్కున్నారు.మరోవైపు రాజధాని నగరం కొలంబోనుంచి పెద్దసంఖ్యలో ప్రజలు వలసవెళ్లారు. నగరంలో ఉండేదుకు వారు సుముఖంగా లేదు. కర్ఫ్యూ సడలించినవెంటనే పెట్టేబేడా సర్దుకుని దూర ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కర్ఫ్యూ సడలించగా కొలంబో బస్‌స్టేషన్‌కు జనం పోటెత్తారు.

గొటబాయ రాజీనామా చేయాలి : విపక్షనేత ప్రేమదాస

నిర్ణీత కాలపరిమితి లోగా అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే రాజీనామా చేసేందుకు ముందుకువస్తే ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని ప్రధాన ప్రతిపక్షం సమజి జన బలవెగయ అధినేత సజిత్‌ ప్రేమదాస గురువారం ప్రకటించారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ముందుకురావాలన్న గొటబాయ పిలుపునకు స్పందించిన ఆయన కొన్ని షరతులు ప్రకటించారు. రాజ్యాంగంలోని 19, 21 అధికరణాలను వెంటనే అమలు చేయాలని, తద్వారా అన్ని రాజకీయ పక్షాలతో అధ్యక్షుడు కలసి పనిచేయాలని, అధ్యక్షుడి కార్యనిర్వాహక అధికారాలకు కత్తెర వేయాలని వీలైనంత త్వరగా ఎన్నికలు జరపాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ మేరకు అధ్యక్షుడికి లేఖ రాశారు. ప్రధానిగా రణిల్‌ను నియమించడంపై ఆచితూచి స్పందించారు. తదుపరి వ్యూహాన్ని త్వరలోనే ప్రకటిస్తామని అన్నారు.
గొటబాయపై అవిశ్వాసం దేశాధ్యక్షుడు గొటబాయ రాజపక్సపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని విపక్షాలు గురువారం నిర్ణయించాయి. ఈనెల 17న పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభమైన వెంటనే తీర్మానాన్ని ప్రవేశపెట్టి చర్చలు పట్టుబట్టాలని నిర్ణయానికి వచ్చాయి. వివిధ రాజకీయ పక్షాలతో గురువారం స్పీకర్‌ భేటీ అయ్యారు. అధ్యక్షుడిపై అవిశ్వాస తీర్మానం విషయాన్ని ఆయన ధ్రువీకరించారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి

Advertisement

తాజా వార్తలు

Advertisement