Thursday, March 28, 2024

Big Story : నష్టాల వానాకాలం సాగు.. భారీ వర్షాలు, తెగుళ్లతో వరి రైతు కుదేలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: అకాల వర్షాలకు, ఎండనకా, వాననకా, పగలనకా, రాత్రనకా, పురుగనకా, పుట్రనకా కష్టపడి చేసిన వరి సాగు రైతులకు నష్టాలనే మిగిల్చింది. ప్రస్తుత వానాకాలంలో వరిసాగు రైతులకు నష్టాలనే మిగిల్చింది. ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తున్నా, వ్యవసాయ మార్కెట్లలో వరికి మద్దతు ధరకు మించి ధర పెడుతున్నా… దిగుబడి తగ్గిపోవడంతో రైతులు కష్టాల్లో కూరుకుపోయారు. ఈ సారి విస్తారంగా కురిసిన వర్షాలతోపాటు దోమకాటు, కాటుక తెగులు, మొగిపురుగు సోకడంతో వరి దిగుబడి గణనీయంగా తగ్గింది. వర్షాకాలంలో ఎకరాకు ఎంత లేదన్నా 20 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా… చాలా మంది రైతులకు కనీసం 18 క్వింటాళ్లు కూడా రాని పరిస్థితులు నెలకొన్నాయి.

ఈ ఏడాది జులై నుంచి అక్టోబరు దాకా భారీ వర్షాలు, అధిక తేమతో తెగుళ్లు విజృంభించాయి. చాలా ప్రాంతాల్లో వరికి కాటుక తెగులు, మొగిపురుగు సోకడంతో ధాన్యం నల్లబడి ఆశించిన దిగుబడి తగ్గింది. మరికొన్ని ప్రాంతాల్లో ఊస తెగులు సోకి వరి కంకులు తాలుపోయాయి. భారీ వర్షాల కారణంగా వరిలో కాండం తొలిచే పురుగును నియంత్రించలేకపోయామని రైతులు వాపోతున్నారు. ఫలితంగా తీవ్ర నష్టం మిగిలిందని చెబుతున్నారు. ఖరీఫ్‌ సీజన్‌లో సంతోషంగా వరి పంట కోసిన రైతులు ధాన్యాన్ని కల్లాలకు తరలించారు. వడ్లు కాంటా అయ్యాక లెక్క చూస్తే ఎకరాకు తక్కువలో తక్కువ 5 క్వింటాళ్ల మేర దిగుబడి త్గగిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

దున్నకం, నాటు ఖర్చులు, ఎరువులకు పెట్టుబడులు, వరికోత వ్యయం ఇవన్నీ కలుపుకుంటే పంట అమ్మగా వచ్చిన రాబడితో కనీసం పెట్టుబడులు కూడా గిట్టుబాటు కావడం లేదని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు తమ ఆవేదనను తోటిరైతులతో పంచుకుంటుండడం పరిపాటిగా మారింది. ఎకరా వరిసాగుకు ఎంత లేదన్నా రూ.35 వేల దాకా పెట్టుబడి వ్యయం అయింది. దిగుబడి చూస్తే ఎకరాన 20 క్వింటాళ్లు కూడా రాకపోవడంతో అదనంగా పెట్టుబడి ఖర్చులు రూ.5 వేల నుంచి రూ.10 వేల దాకా మీదపడ్డాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సాధారణంగా యాసంగితో పోల్చుకుంటే ఖరీఫ్‌ వానాకాలంలో వరి దిగుబడి కాస్త తక్కువగానే ఉంటుంది. అయితే యాసంగికి, ఖరీఫ్‌కు ఆ తేడా ఎకరాకు రెండు, మూడు క్వింటాళ్ల వరకే ఉంటుంది. కాని గత యాసంగితో పోలిస్తే ఈ సారి ఎకరా వరి దిగుబడి ఏకంగా 6 నుంచి 8 క్వింటాళ్ల మేర తగ్గడంతో రైతులు తలలు పట్టుకుంటున్నారు. ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో రాష్ట్రంలోని చాలా మంది రైతులకు ఎకరాకు దాదాపు 18 క్వింటాళ్ల దిగుబడే వచ్చింది. ప్రభుత్వం కల్పించిన మద్దతు ధర ప్రకారం చూసుకుంటే ఆదాయం రూ.36 వేలే వస్తోంది. దీంతో ఆరు నెలలు కష్టపడి పంట పండిస్తే మిగిలేది ఏమీ లేకుండా పోతోందని రైతు కుటుంబాలు నిరాశలో కూరుకుపోతున్నాయి. మిగిలిన అరకొర రూ5, 10వేల ఆదాయాన్ని లెక్కేసుకుంటే రైతుకు రోజువారీ కూలీకూడా గిట్టుబాటు కాని పరిస్థితులు నెలకొన్నాయి. రోజుకు రూ.50 నుంచి రూ.100 కూలీకి ఆరు నెలలు కష్టపడి వరిసాగు చేస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement