Thursday, April 25, 2024

అలర్ట్: వచ్చే 5, 6 గంటలు అతి భారీ వర్షాలు..!

గులాబ్ తుఫాన్ తెలంగాణపై తీవ్ర ప్రభావాన్నే చూపిస్తోంది… హైదరాబాద్‌తో పాటు.. తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి.. 7 జిల్లాలకు రెడ్‌ అలర్ట్, 17 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు అధికారులు.. ఇక, హైదరాబాద్‌లో మూడు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణశాఖ హెచ్చరించింది.. రానున్న 5, 6 గంటలు హైదరాబాద్‌ సిటీలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు హైదరాబాద్ వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్న.. తెలంగాణలో రెడ్ అలర్ట్ కొనసాగుతోందని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు తెలంగాణలో 15 సెంటీ మీటర్లు, హైదరాబాద్‌లో మధ్యాహ్నం 3 గంటల వరకు 3.3 సెంటీ మీటర్ల వర్షం నమోదైందని వెల్లడించారు.

రాత్రి సమయంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు హైదరాబాద్‌ వాతావరణ శాఖ డైరెక్టర్‌ నాగరత్న.. హైదరాబాద్, వరంగల్, ములుగు, భూపాలపల్లి, జనగామ, సిద్దిపేట, గజ్వేల్ జిల్లాలో ఇవాళ రాత్రి భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.. ఇక, గులాబ్‌ తుఫాన్‌ తీరాన్ని తాకి బలహీన పడిందని.. ఇది తీవ్ర వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నాయని.. క్రమంగా బలహీన పడి అల్పపీడనంగా మారొచ్చు అన్నారు. ఛత్తీస్‌గఢ్‌ నుంచి తెలంగాణ మీదుగా గాలులు వీస్తుండటం కారణంగా హైదరాబాద్ పై వర్ష ప్రభావం తీవ్రంగా ఉందన్నారు నాగరత్న.

ఇది కూడా చదవండి: ఆసక్తికరంగా వైష్ణవ్ తేజ్ ‘కొండపొలం’ ట్రైలర్

Advertisement

తాజా వార్తలు

Advertisement