Tuesday, September 19, 2023

నాలుగు రోజులపాటు వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాగల నాలుగు రోజులపాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. అదే సమయంలో వారం రోజులపాటు గరిష్ట ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదవుతాయని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఎండ, వేడిగాలులతో సతమతమవుతున్న రాష్ట్ర ప్రజలకు నాలుగు రోజులపాటు వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ సూచన చల్లని కబురు అందించింది. నాలుగు రోజులు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది.

గాలి వేగం గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీస్తుందని తెలిపింది. పలు జిల్లాలు ఆదిలాబాద్‌, కుమ్రంభీంఆసీఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి, వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడుతాయని హెచ్చరించింది. మిగిలిన చోట్ల అక్కడక్కడా చిరు జల్లులు కురుస్తాయని వెల్లడించింది. ఈ నెల 9 వరకు పలు జిల్లాలకు వర్ష సూచన ఉన్నట్లు పేర్కొంది.

- Advertisement -
   

పలుచోట్ల జల్లులు…

గడిచిన 24 గంటల్లో హైదరాబాద్‌ 0.8 మిల్లిd మీటర్లు, కామారెడ్డిలో 0.4, కరీంనగర్‌లో 0.1, మేడ్చల్‌ మల్కాజిగిరిలో 0.3 మి.మీలు, మెదక్‌లో 1.7 మి.మీలు, నాగర్‌కర్నూలులో 0.2, నల్గొండలో 0.9, నారాయణపేటలో 04, నిర్మల్‌లో 0.5, నిజామాబాద్‌లో 0.2, పెద్దపల్లిలో 0.4, రాజన్నసిరిసిల్లలో 0.5, రంగారెడ్డిలో 0.1, సంగారెడ్డిలో 4.3 మి.మీలు, వికారాబాద్‌లో 0.4, మి.మీల వర్షపాతం కురిసింది.

వారం రోజులపాటు ఎండలు… పలు జిల్లాల్లో వడగాలులు

మరోవారం పాటు రాష్ట్ర వ్యాప్తంగా పగటి గరిష్ట ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదవుతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పలు జిల్లాల్లో వడగాలులు వీస్తాయని హెచ్చరించింది. ఈ నెల 7 వరకు వడగాలుల తీవ్రత కొనసాగుతుందని స్పష్టం చేసింది. వారం రోజులపాటు రాష్ట్ర మంతటా గరిష్ట పగటి ఉష్ణోగ్రతలు 42 నుంచి 44 డిగ్రీల సెంటిగ్రేడ్‌ వరకు స్థిరంగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం తదితర జిల్లాల్లో వడగాలులు వీస్తాయని హెచ్చరించింది.

ఆదివారం రాష్ట్రమంతా ఎండలు దంచికొట్టాయి. గడిచిన 24 గంటల్లో ఆదిలాబాద్‌లో 42.3 డిగ్రీలు, భద్రాచలంలో 44 డిగ్రీలు, హకీంపేటలో 40.2, దుండిగల్‌లో 40.4, హన్మకొండలో 42, హైదరాబాద్‌లో 42.4, ఖమ్మంలో 44.6, మహబూబ్‌నగర్‌లో 42, మెదక్‌లో 42.8, నల్గొండలో 43.5, నిజామాబాద్‌లో 42.7, రామగుండంలో 42.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పలు జిల్లాల్లో వడగాలులు వీచాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement