Saturday, April 20, 2024

ఉక్రెయిన్‌పై క్షిపణుల వర్షం.. కీవ్‌కు సమీపంలో రష్యా

ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగిస్తూనే ఉంది. క్షిపణులతో విరుచుకుపడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. ఉక్రెయిన్‌లో సైనిక చర్యకు సంబంధించిన మొదటి ఫేజ్‌ పూర్తయ్యిందని రష్యా డిప్యూటీ చీఫ్‌ కల్నల్‌ జనరల్‌ సెర్గీ రుడ్సోయ్‌ తెలిపారు. ఈ ఆపరేషన్‌కు సంబంధించిన అన్నీ పనులు పూర్తయినట్టు వివరించారు. ఉక్రెయిన్‌లోని డాన్‌బాస్‌ ప్రాంతాన్ని విముక్తి చేయడమే రష్యా ప్రధాన లక్ష్యం అని ప్రకటించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ కూడా ఈ యుద్ధం ప్రణాళిక ప్రకారమే జరుగుతోందని అన్నారు. ఉక్రెయిన్‌లో సాయుధ దళాల పోరాట సామర్థ్యం గణనీయంగా తగ్గిందని చెప్పారు. ఈ యుద్ధంలో సుమారు 1000 మంది రష్యా సైనికులు చనిపోతే.. మూడు వేల మందికి పైగా గాయపడ్డారని తెలిపారు.

నాటో చెబుతున్నది 15వేల మంది…

నాటో మాత్రం ఈ యుద్ధంలో దాదాపు 15వేల మంది రష్యా సైనికులు మరణించారని చెబుతోందన్నారు. ఉక్రెయిన్‌లోని ప్రధాన నగరాలను దిగ్బంధం చేసి.. ఉక్రెయిన్‌ బలగాలకు నష్టం కలిగించేలా చేయడంతో పాటు అక్కడ సైనిక దళాలు బలపడకుండా చేస్తామన్నారు. డోనెట్స్‌, లుహాన్స్‌ పీపుల్స్‌ రిపబ్లిక్‌ భూభాగాలను స్వాధీనం చేసుకునేంత వరకు ఈ దాడి ఆపేది లేదని రష్యా ప్రకటించింది. పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయలేదని చెప్పుకొచ్చింది. 93 శాతం లుహాన్స్‌, 54 శాతం డోనెట్స్‌ తమ ఆధీనంలో ఉన్నాయని ప్రకటించింది. ఉక్రెయిన్‌ వైమానిక, నావికా దళాల్లోని అత్యధిక భాగాన్ని తమ బలగాలు నాశనం చేశాయని, దీంతో మొదటి దశ సైనిక చర్య విజయవంతమైనట్టు రష్యా ప్రకటించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి...

Advertisement

తాజా వార్తలు

Advertisement