Friday, March 29, 2024

రగులుతున్న సరిహద్దు వివాదం.. కర్నాటక బస్సులపై శివసేన కార్యకర్తల దాడి

కర్ణాటక, మహారాష్ట్ర మధ్య సరిహద్దు వివాదం మరోసారి రగులుకుంది. బెలగావిలో మహారాష్ట్రకు చెందిన వాహనాలపై దాడికి ప్రతీకారంగా శివసేన (ఉద్ధవ్‌ వర్గం) కార్యకర్తలు రెచ్చిపోయారు. మంగళవారం పుణలోని సర్గేట్‌ బస్టాండ్‌ సమీపంలోని పార్కింగ్‌లో నిలిపివున్న కొన్ని కర్ణాటక రాష్ట్రరోడ్డు రవాణా సంస్థ బస్సులను ధ్వంసం చేశారు. మంగళవారం తెల్లవారు జామున బెలగావి సమీపంలోని హీరేబాగేవాడి వద్ద మహారాష్ట్రకు చెందిన ఆరు వాహనాలను కర్ణాటక రక్షణ వేదిక కార్యకర్తలు లక్ష్యంగా చేసుకున్న నేపథ్యంలో పుణలో ఈ సంఘటన చోటుచేసుకుంది. కర్ణాటకలో మహారాష్ట్రీయుల వాహనాలు లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. అయినా ఇక్కడి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పొరుగు రాష్ట్రానికి భయపడుతోంది. మంత్రులు తమ బెలగావి పర్యటనలను రద్దు చేసుకున్నారు.

సొంత ప్రజలను రక్షించడంలో ప్రభుత్వం విఫలమైతే, ఉద్ధవ్‌ ఠాక్రే ప్రజల రక్షణ బాధ్యతలను స్వీకరిస్తాడని సేన కార్యకర్త ఒకరు తెలిపారు. సేన కార్యకర్తలు బస్సులపై నల్ల ఇంక్‌ విసిరారు. నంబర్‌ ప్లేట్లను నల్లగా మార్చేశారు. జై మహారాష్ట్ర అని వాహనాల అద్దాలపై కాషాయరంగులో రాశారు. ఈ ఘటనకు సంబంధించి ఏడుగురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. కాగా, ఇరు రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం ఘర్షణలకు దారితీస్తున్న క్రమంలో, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌, కర్ణాకట సీఎం బసవరాజ్‌ బొమ్మైకి ఫోన్‌ చేశారు. హింసాత్మక పరిస్థితిపై అసంతృప్తి వ్యక్తంచేశారు. బెలగావిలో జరుగుతున్న పరిణామాలతో మేము చాలా నిరాశ చెందాము. హీరేబాగ్వాడి వంటి ఘటనలు ఆమోదయోగ్యం కాదు అని ఫడ్నవీస్‌ వ్యాఖ్యానించారు.

ఈ విషయంలో ఇప్పటి వరకు మహారాష్ట్ర చాలా సంయమనం చూపిందని, హింసాత్మక ఘటనలను నివారించడానికి గట్టి చర్యలు తీసుకోవాలని బొమ్మైని కోరారు. దీనిపై కర్ణాటక సీఎం సానుకూలంగా స్పందించారు. బెలగావి ఘటనలో బాధ్యులపై చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. మంత్రులను పంపించవద్దని కర్ణాటక ప్రభుత్వం లేఖ రాయడంతో మహారాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. బెలగావి పర్యటనను వాయిదా వేసింది. ఈ పరిణామాలు రెండు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలను పెంచుతోంది. అయితే, నారాయణగౌడ నేతృత్వంలోని కర్ణాటక రక్షణ వేదిక కార్యకర్తలు మంగళవారం బెలగావిని సందర్శించారు. ఇది మహారాష్ట్ర నుంచి వచ్చిన వాహనాలపై రాళ్ల దాడికి దారితీసింది. మరాఠీ మాట్లాడే గ్రామాలను మహారాష్ట్రలో కలపడాన్ని కర్ణాటక రక్షణ వేదిక తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇంతలో పొరుగు రాష్ట్రానికి సరైన సమాధానం చెబుతామంటూ శివసేన ఉద్ధవ్‌ వర్గం ఒక ప్రకటన విడుదల చేసింది. మీరు మా బస్సులు ఐదు ధ్వంసం చేస్తే, మేము మీ బస్సులు 50 ధ్వంసం చేస్తామంటూ ఆపార్టీ కార్యకర్తలు హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement