Thursday, April 25, 2024

మాస్క్ ధరించని వారిపై ఉక్కుపాదం.. 832 మందిపై కేసులు!

తెలంగాణలో కరోనా కేసులు భారీ సంఖ్యలో పెరుగుతున్నాయి. రాజధాని హైదరాబాద్ పరిధిలో కరోనా తీవ్రత అధికంగా ఉంది. ఈ నేపథ్యంలో కరోనాను కట్టడి చేసేందుకు నగర పోలీసులు కఠిన చర్యలకు చేపట్టారు. మాస్క్ ధరించని వారికి భారీ జరిమానాలు వేస్తున్నారు. ఈ సందర్భంగా రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా వేగంగా విస్తరిస్తోందని, ప్రజలందరూ అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని తెలిపారు. మాస్క్ ధరించని వారిపై కేసులు నమోదు చేసి రూ.1000 జరిమానా విధిస్తున్నామని పేర్కొన్నారు.

రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా కూడా మాస్కులు లేని వారిని గుర్తించి, కేసులు నమోదు చేస్తామన్నారు. అంతేకాదు జరిమానా కూడా విధిస్తామని మహేశ్ భగవత్ హెచ్చరించారు. నిన్న ఒక్కరోజే మాస్క్ ధరించని 832 మందిపై కేసులు నమోదు చేశామని వెల్లడించారు. పోలీసులు కూడా ప్రధాన కూడళ్లలో కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారని చెప్పారు.

పోలీస్ డిపార్ట్ మెంట్ లో కూడా చాలా మంది కరోనా వైరస్ బారిన పడుతున్నారని చెప్పారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో 5 వేల మంది సిబ్బంది వ్యాక్సిన్ తీసుకున్నారని వెల్లడించారు. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ చేసుకునే వారు 100 మంది కంటే ఎక్కువగా ఉండకూడదని చెప్పారు. సామాజిక దూరం పాటిస్తూ.. మాస్కులు, శానిటైజర్ తప్పనిసరిగా వాడాలని సూచించారు. ఆస్పత్రులల్లో బెడ్స్ కొరత ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement