Thursday, December 8, 2022

నాణ్యమైన పోషకాహారం ప్రపంచం ముందున్న సవాల్.. క్రాప్ లైఫ్ ఇండియా సదస్సులో నిరంజన్​రెడ్డి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: నేటి ప్రపంచంలో నాణ్యమైన పోషకాహరమే అసలైన సవాల్ అని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో ‘క్రాప్ లైఫ్ ఇండియా’ సంస్థ 42వ వార్షిక సమావేశం సంధర్భంగా వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలపై నిర్వహించిన సదస్సులో మంత్రి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి కైలాష్ చౌదరి, యూపీ, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల వ్యవసాయ శాఖామంత్రులు సూర్యప్రతాప్ షాహి, కమల్ పటేల్, బీసీ పాటిల్, సంస్థ వైస్ చైర్మన్ అనిల్‌ కక్కర్‌తో పాటు దేశవిదేశాల్లోని అనేకమంది ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు.

- Advertisement -
   

ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. భావితరాల ఆరోగ్యం కోసం నాణ్యమైన ఆహారం అందించడం కోసం వ్యవసాయ రంగం సిద్ధం కావాలని అన్నారు. వ్యవసాయం అనేది రాష్ట్రాల పరిధిలోని అంశమే అయినప్పటికీ, దేశంలోని వివిధ ప్రాంతాల భౌగోళిక, వాతావరణ పరిస్థితులు భిన్నంగా ఉన్నందున ఒకే ఏకరూప ప్రణాళికతో ఉపయోగం ఉండదని తెలిపారు. సాగు అనుకూల భూవిస్థీర్ణంలో ప్రపంచంలో భారత్ 2వ స్థానంలో ఉందని, దేశంలో ఉన్న భూకమతాలను క్రాప్ కాలనీలుగా విభజించాలని ఆయన సూచించారు.

దేశంలోని వివిధ ప్రాంతాలు, భూమి, వాతావరణ పరిస్థితులను బట్టి అక్కడ ఏ పంటలకు అనుకూలంగా ఉన్నాయో గుర్తించి ఆ మేరకు అక్కడ ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. సాంప్రదాయ పంటల నుంచి రైతులను ఇతర పంటలవైపు మళ్లించడానికి దేశవిదేశాల్లో అవసరమైనటువంటి ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు రైతులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించాలని సూచించారు. వ్యవసాయ రంగం విషయంలో కేంద్రం ప్రధాన బాధ్యత తీసుకోవాలని అన్నారు. ఎగుమతులు, సేకరణ కేంద్రం చేతుల్లో ఉన్న నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లో చేపట్టాల్సిన పంటల వైవిధ్యం, పంటమార్పిడి కోసం కేంద్రం ప్రత్యేక రాయితీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అప్పుడే రైతాంగం సాంప్రదాయ సాగును వీడి ఇతర పంటల సాగుకు మొగ్గుచూపుతారని సూత్రీకరించారు.

దేశంలో నూనెగింజలు, పప్పుదినుసుల కొరత ఉందని, ప్రతి ఏటా వాటి దిగుమతుల కోసం లక్షల కోట్లు వెచ్చించాల్సి వస్తోందని మంత్రి నిరంజన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచంలో రెండవ అతిపెద్ద వ్యవసాయ దేశమైన భారత్ ఆ దుస్థితి నుంచి బయటపడాలని అభిలషించారు. ప్రపంచానికి అన్నం పెట్టగలిగే భారత్ తన సొంత అవసరాల కోసం ఇతర దేశాల మీద ఆధారపడడం శాస్త్ర, సాంకేతిక రంగాలు ఇంతలా అభివృద్ధి చెందిన యుగంలో సముచితం కాదని అన్నారు. 58 శాతం జనాభా ఆధారపడి ఉన్న వ్యవసాయరంగాన్ని విస్మరించకుండా దానిని ప్రధాన రంగంగా గుర్తించి తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగం అభివృద్ధికి ఒక క్రమ పద్దతిలో చర్యలు చేపట్టిందని తెలిపారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ రంగానికి ఇచ్చిన ప్రోత్సాహంతో తెలంగాణ వ్యవసాయం నేడు ఉజ్వలంగా ఉందని, దేశానికే తలమానికంగా మారిందని వ్యాఖ్యానించారు. ఏడో శతాబ్దంలోనే తెలంగాణలో కాకతీయుల కాలంలో గొలుసుకట్టు చెరువులతో సాగునీటి వ్యవస్థ పటిష్టంగా ఉందని గుర్తుచేశారు. సమైక్యపాలనలో చెరువులు, కుంటలు ధ్వంసమయ్యాయని, గత ఎనిమిదేళ్లలో రూ. 1.25 లక్షల కోట్లతో మిషన్ కాకతీయ పథకం కింద చెరువులు, కుంటలు, ఇతర కొత్త సాగునీటి ప్రాజెక్టులు నిర్మించుకున్నామని తెలిపారు.

ప్రస్తుతం సాగునీటి రంగంలోనే కాక మంచినీటి చేపల ఉత్పత్తిలో దేశంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని తెలిపారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్, తొమ్మిది విడతల్లో రూ.58 వేల కోట్లు రైతుబంధు కింద రైతుల ఖాతాలలో జమచేయడం, రైతుభీమా పథకం కింద 88,175 మంది రైతులకు రూ.5 లక్షల చొప్పున అందించి వ్యవసాయ రంగానికి చేయూతనిచ్చామని తెలిపారు. ఈ చర్యల కారణంగా తెలంగాణ పంటల ఉత్పత్తిలో అగ్రభాగంలో నిలిచిందని, తెలంగాణ పంటల కొనుగోలుకు కేంద్రం చేతులెత్తేసిన పరిస్థితికి చేరుకున్నామని అన్నారు. తెలంగాణ వ్యవసాయ రంగానికి ఇచ్చిన చేయూత కారణంగా దేశంలో ఎక్కడాలేని విధంగా యువత వ్యవసాయరంగం వైపు ఆకర్షితులవుతోందని నిరంజన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

వ్యవసాయరంగాన్ని ఉపాధిగా ఎంచుకోవాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని, వ్యవసాయరంగం బలోపేతం కోసం ప్రతి 5 వేల ఎకరాలకు ఒక క్లస్టర్ ఏర్పాటు చేసి రైతువేదికను ఏర్పాటు చేసి, వ్యవసాయ విస్తరణ అధికారిని నియమించి రైతులకు శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం నిరంతరం అందజేస్తున్నామని తెలిపారు. ప్రతి గ్రామానికి రైతుబంధు సమితులను ఏర్పాటుచేసి రైతులను సంఘటితం చేసి వారి సమస్యలను నిరంతరం అధ్యయనం చేస్తున్నామని చెప్పారు. పంటల వైవిధ్యీకరణలో భాగంగా 20 లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగుకు ప్రణాళికాబద్ధంగా ముందుకుసాగుతున్నామని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement