Friday, April 19, 2024

కేంద్ర హోంమంత్రిని కలిసిన పుంగనూరు నేత రామచంద్ర యాదవ్.. తనను హతమార్చే కుట్ర జరుగుతోందని ఫిర్యాదు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తనను హతమార్చేందుకు కుట్ర చేస్తోందంటూ పుంగనూరుకు చెందిన యువనేత బోడె రామచంద్ర యాదవ్ ఆరోపించారు. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి ఈ అంశంపై ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించి దాడులకు, కుట్రలకు పాల్పడుతున్న వైనంపై కేంద్ర మంత్రికి వివరించానని చెప్పారు. అమిత్ షా ను కలిసిన తర్వాత ఆయన ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర పరిణామాలపై తాను దాదాపు 40 నిమిషాల పాటు కేంద్ర హోంమంత్రికి వివరించానని చెప్పారు. గత నెలలో తనపై, తన కుటుంబ సభ్యులపై రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులతో దాడి చేయించారని ఆరోపించారు.

- Advertisement -

ఈ దాడిలో పోలీసులు కూడా భాగస్వాములేనని, అందుకే ఇప్పటి వరకు కేసు కూడా నమోదు చేయలేదని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, అంబేద్కర్ రాజ్యాంగానికి బదులుగా జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగం అమలవుతోందని విమర్శించారు. పుంగనూరులో మాత్రం పెద్దిరెడ్డి రాజ్యాంగం నడుస్తోందని దుయ్యబట్టారు. 2019 ఎన్నికల్లో తాను పుంగనూరు నుంచి పోటీచేశానని, వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తనపై దాడులు చేయిస్తోందని ఆరోపించారు.

2022 డిసెంబర్ 4న రైతు సమస్యలపై ‘రైతు భేరి’ సమావేశం ఏర్పాటు చేసుకున్నామని, కానీ ఈ సమావేశం జరగకుండా ప్రభుత్వం అడ్డుకుందని తెలిపారు. హైకోర్టు అనుమతించినప్పటికీ సభ ఏర్పాటు చేయనివ్వలేదని మండిపడ్డారు. అన్ని విషయాలను అమిత్ షాకు వివరించి చెప్పానని, విచారణ జరిపించి చర్యలు చేపడతామని ఆయన హామీ ఇచ్చారని రామచంద్ర యాదవ్ చెప్పారు. అవసరమైతే తగిన భద్రత కూడా కల్పిస్తానంటూ అమిత్ షా భరోసా ఇచ్చారని యాదవ్ వెల్లడించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement