Friday, January 27, 2023

క్రైస్తవ ఆస్తులు కాపాడండి.. కేంద్రానికి నేషనల్ క్రిస్టియన్ బోర్డ్ వినతి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో చర్చి ఆస్తులు అన్యాక్రాంతమవుతున్నాయని నేషనల్ క్రిస్టియన్ బోర్డ్ ఛైర్మన్ జాన్ మాస్కో ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన చర్చి ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చట్టాన్ని తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ క్రమంలో దేశంలో వివిధ క్రైస్తవ మత సంస్థలు చర్చి ఆస్తులను అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్న వైనాన్ని వివరించారు.

- Advertisement -
   

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు కేంద్రంగా ఉన్న ఆంధ్రా ఎవాంజిలికల్ లూథరన్ చర్చి (ఏఈఎల్సీ)కి చెందిన ఆస్తుల విషయంలో జరుగుతున్న అక్రమాల గురించి వివరించారు. చర్చి ఆస్తులను తొలుత లీజు పేరుతో ఇచ్చి, ఆ తర్వాత అమ్ముకుని సొమ్ము చేసుకున్నారని ఆరోపించారు. ఈ అక్రమాల వెనుక ప్రముఖ క్రైస్తవ మతప్రచారకులు బ్రదర్ అనిల్ ఉన్నారని జాన్ మాస్కో ఆరోపించారు. వీటిపై తాను ఇప్పటికే సీబీఐకి ఫిర్యాదు చేసినట్టు వెల్లడించారు.

ఈ తరహాలో దేశవ్యాప్తంగా ‘వరల్డ్ మిషనరీ ఎవాంజలిజం’ (డబ్ల్యుఎంఈ), పెంతెకోస్త్, హెబ్రోన్, ఏఎఫ్ఎల్సీ, సీబీసీ, సీఎన్సీ వంటి క్రైస్తవ మత సంస్థల ఆస్తులు సైతం ఇదే తరహాలో అన్యాక్రాంతం అవుతున్నాయని జాన్ మాస్కో ఆందోళన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఈ తరహా అక్రమాలపై 8,800కి పైగా కేసులున్నాయని తెలిపారు. సంబంధం లేని వ్యక్తులను బిషప్‌లుగా, పాస్టర్లుగా నియమిస్తూ ఆస్తులు కాజేస్తున్నారని వెల్లడించారు.

ఈ పరిస్థితుల్లో క్రైస్తవ ఆస్తులను పరిరక్షించేలా ఒక పటిష్టమైన చట్టాన్ని తీసుకురావాలని, ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత శీతాకాల సమావేశాల్లోనే ఒక బిల్లును ప్రవేశపెట్టాలని జాన్ మాస్కో డిమాండ్ చేశారు. ముస్లిం మత సంస్థల ఆస్తుల రక్షణ కోసం వక్ఫ్ బోర్డ్ చట్టం, హిందూ ఆలయాల ఆస్తుల రక్షణ కోసం ఎండోమెంట్ చట్టం ఉన్నట్టుగా క్రైస్తవ ఆస్తుల రక్షణ కోసం ఒక చట్టం రూపొందించాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement