Saturday, April 20, 2024

కాబోయే ఇంజనీర్ల చూపు… హైదరాబాద్‌ వైపు!

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: కాబోయే ఇంజనీర్ల చూపు హైదరాబాద్‌ వైపు పడుతోంది. హైదరాబాద్‌లో చదివితే చదువుతోపాటు ఉద్యోగాన్ని కూడా తొందరగా పొందొచ్చనే భావనతో చాలా మంది విద్యార్థులు ఇంజనీరింగ్‌ సీటు కోసం హైదరాబాద్‌కు వస్తున్నారు. సిటీలోని ఇంజనీరింగ్‌ కాలేజీల్లో చదివేందుకు పోటీ పడుతున్నారు. కౌన్సెలింగ్‌లో భాగంగా ఇక్కడి కాలేజీలకే ఎక్కువగా ఆప్షన్లు ఇచ్చుకొని సీట్లు పొందుతున్నారు. ఇంజనీరింగ్‌ సీటు కోసం చాలా మంది ఆయా జిల్లాల నుంచి హైదరాబాద్‌ నగరానికి చేరుకుని, నగరంతో పాటు చుట్టుపక్కల ఉన్న ఇంజనీరింగ్‌ కళాశాలల్లో అడ్మిషన్లు పొంది చదివేందుకు విద్యార్థులు ఆసక్తి చూపిస్తున్నారు. దానికి ఎంత ఖర్చు అయినా వెనుకాడటంలేదు. మొదటి విడత కౌన్సెలింగ్‌లోనే హైదరాబాద్‌తోపాటు చుట్టుపక్కల ఉన్న ఇంజనీరింగ్‌ కాలేజీల్లోని సీట్లన్ని దాదాపు నిండిపోతున్నాయి.

మిగిలిన ఏమైనా సీట్లు ఉంటే అవి కూడా రెండో విడత కౌన్సెలింగ్‌లో భర్తీ అవుతున్నాయి. మొదటి విడత కౌన్సెలింగ్‌లో రాష్ట్రంలో కన్వీనర్‌ కోటా కింద సీట్లు మొత్తం 71,286 ఉండగా, అందులో 60,208 భర్తీ అయిన సీట్లల్లో మెజార్టీ సీట్లన్నీ సిటీ, చుట్టుపక్కల కాలేజీల్లోనివే ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే భర్తీ అయిన సీట్లల్లో 43 వేల మంది అభ్యర్థులే కాలేజీల్లో సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేశారు. రెండో విడత ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ ఈనెల 28 నుంచి మొదలవుతున్న నేపథ్యంలో మొదటి విడతలో హైదరాబాద్‌లో సీటు రాని అభ్యర్థులు ఈసారి సీటు పొందాలనే పట్టుదలతో ఉన్నారు. దానికనుగుణంగానే ఆప్షన్లు ఇచ్చుకుంటున్నారు. దీంతో సిటీలోని ఇంజనీరింగ్‌ సీట్లకు పోటీ ఎక్కువగా ఉంటోంది. మరోవైపు జిల్లాల్లో టౌన్‌, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే కళాశాలల్లో మాత్రం సీట్లు మొత్తం నిండడంలేదు. సగంపైగా సీట్లు ప్రతీ ఏడాది ఖాళీగానే మిగిలిపోతున్నాయి.

హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో ఉండే కాలేజీల్లో నాణ్యమైన విద్య, వసతులు, క్యాంపస్‌ ఇటర్వ్యూలు ఉంటాయనే భావన విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఉంది. వాటిల్లో చదివిస్తే మంచి సంస్థలో ఉద్యోగం పొందే వీలుందనే అభిప్రాయం వారిలో ఉంది. దాంతో తమ పిల్లలను నగరానికి పంపించి చదివించేందుకు మొగ్గుచూపిస్తున్నారు. దీంతో సీటీ కాలేజీలు, పేరున్న కాలేజీల్లో 80 శాతానికి పైగా సీట్లు మొత్తం మొదటి, రెండు విడుతల్లోనే నిండుతున్నాయి. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఇంజనీరింగ్‌ కాలేజీల్లో మాత్రం ప్రతి ఏడాది 50 శాతం వరకే సీట్లు నిండుతున్నట్లు తెలుస్తోంది. ఇక టాప్‌ కాలేజీల్లోనైతే 100 శాతం సీట్లు అన్ని బ్రాంచీల్లో నిండుతున్నాయి. రాష్ట్రంలో 176 కాలేజీల్లో 71286 ఇంజనీరింగ్‌ సీట్లు ఉన్నాయి. ఇందులో 84 శాతం వరకు సీట్లను మొదటి విడతలో కేటాయించారు.

269 కాలేజీల్లో క్లోజ్‌ అయినవి 93…

- Advertisement -

సీట్లు నిండకపోవడంతో నిర్వహణ భారం ఎక్కువై కాలేజీలు మూతపడే స్థాయికి చేరుకుంటున్నాయి. స్టాఫ్‌కు సరిగా జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంటున్నాయి. విద్యార్థుల అభిరుచికి తగిన విధంగా డిమాండ్‌ ఉన్న సీఎస్‌ఈ, ఈసీఈ, మిషన్‌ లెర్నింగ్‌ ఇతర కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఐటీ కోర్సులకే కాలేజీలు ప్రాధాన్యత ఇస్తున్నాయి. మెకానికల్‌, సివిల్‌ తదితర డిమాండ్‌ తక్కువ ఉన్న కోర్సులను పట్టించుకోవడం లేదు. ఏ కోర్సు అయినప్పటికీ మంచి అధ్యాపకులను నియమించడంతో పాటు, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తయారుచేసిన్పుడే సిటీ కాలేజీలతో సమానంగా జిల్లా కాలేజీల్లోనూ సీట్లు నిండే వీలుంది. 2015-16 ఏడాదిలో రాష్ట్రంలో మొత్తం 269 ఇంజనీరింగ్‌ కళాశాలలు ఉండగా, ప్రస్తుతం 176 మాత్రమే ఉన్నాయి. గత ఏడేళ్లలో సుమారు 93 ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలు మూతపడ్డాయి. మూతపడ్డ వాటిలో జిల్లాల్లోని కాలేజీలే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇంజనీరింగ్‌ కాలేజీలంటే గతంలో హైదరాబాద్‌ తర్వాత ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే ఎక్కువగా ఉండేవి. ఒకప్పుడు అవి 50 వరకు ఉంటే ప్రస్తుతం సుమారు 12 వరకే మిగిలినట్లు సమాచారం. మిగతా జిల్లాల పరిస్థితి కూడా దాదాపు ఇంతే. సిటీ కాలేజీలతో పాటు జిల్లాల్లోని కాలేజీల్లోనూ సీట్లకు డిమాండ్‌ పెరిగేలా ప్రభుత్వం, కళాశాలల యాజమాన్యాలు చొరవ తీసుకోవాలి. ఏదో చదువు చెప్పేస్తున్నాం కదా అనే ధోరణి నుంచి బయటపడాలని విద్యా వేత్తలు సూచిస్తున్నారు. నాణ్యమైన విద్యను అందించేలా ముందుకు రావాలి. మంచి అధ్యాపకులను నియమించి, మౌలిక వసతులు, ప్రాంగణ నియామకాలు చేపడితే సిటీ కాలేజీలకు ఏమాత్రం తీసిపోవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement