Monday, March 25, 2024

అనుమతుల్లేకుండా ఏపీలో ప్రాజెక్టులు.. కృష్ణా బోర్డుకు తెలంగాణ లేఖ

అమరావతి, ఆంధ్రప్రభ : కేంద్ర జలశక్తితో పాటు అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతులు లేకుండా కృష్ణా జలాలను తరలించేందుకు ఏపీ నిర్మిస్తున్న ప్రాజెక్టులను తక్షణం నిలుపుదల చేయాలని తెలంగాణ నీటిపారుదల ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ మురళీధర్‌ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కెఆర్‌ ఎంబీ)కు లేఖ రాశారు. చట్టవిరుద్ధంగా కృష్ణా జలాలను తరలించేందుకు ప్రాజెక్టులు నిర్మించటంతో పాటు కొత్త పనులకు టెండర్లు పిలుస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవటం లేదని లేఖలో అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏపీ నిర్మిస్తున్న ప్రాజెక్టులతో పాటు ప్రతిపాదిత ప్రాజెక్టులపై అభ్యంతరం తెలుపుతూ తాము ఇప్పటికి 40 లేఖలు రాసినా కృష్ణా బోర్డు పట్టించుకోవటం లేదన్నారు. గాలేరు-నగరి సుజల స్రవంతి, తెలుగు గంగ, పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ సామర్దం పెంపు ద్వారా కృష్ణా జలాలను బేసిన్‌ అవతలకు ఏపీ తరలిస్తోందని లేఖలో ఆరోపించారు. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ సామర్దం పెంపుదల వల్ల కృష్ణాలో తెలంగాణ వాటాగా దక్కిన జలాలను వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడుతుందనీ, జల విద్యుదుత్పత్తి కోసం శ్రీశైలంలో నీటి నిల్వలు కూడా కరువవుతాయని లేఖలో వివరించారు.

పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ తో పాటు బంకర్ల క్రాస్‌ రెగ్యులేటర్‌ కాంప్లెక్స్‌ కు శ్రీశైలం నుంచి 80 క్యూసెక్కులు తరలించేందుకు ఏపీ ప్రయత్నిస్తోందన్నారు. ఏపీ ప్రభుత్వం 2014 అంతర రాష్ట్ర జలవివాద చట్టాన్ని తుంగలో తొక్కుతోంది. బ్రజేష్‌ కుమార్‌ టైబ్యునల్‌ (కృష్ణా నదీ జలవివాద పరిష్కారాల ట్రిబ్యునల్‌ కెడబ్ల్యుడీటీ-2)లో విచారణలు కొనసాగుతున్నా, తుది తీర్పులు రాకపోయినా ఏపీ లక్ష్య పెట్టటం లేదన్నారు. ఏపీలో అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులపై కృష్ణా బోర్డు ఇకనైనా మేల్కొని అవసరమైన చట్టబద్ద చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement