Wednesday, March 27, 2024

‘నారి’సంధిస్తే ప్రగతిబాణం.. విద్యలో పైచేయి, పాలనలో రాణింపు..

(న్యూఢిల్లి, ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి) : జి20 దేశాల్లోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ భారత్‌దే… స్మార్ట్‌ ఫోన్ల వినియోగంలో ప్రపంచంలోనే భారత్‌ మొదటి స్థానంలో ఉంది… ఇంటర్‌నెట్‌ వినియోగంలో రెండో స్థానంలో ఉంది… వినిమయ వస్తువుల మార్కెట్‌లో ప్రపం చంలోనే భారత్‌ మూడో స్థానంలో ఉంది.. భారతీయులు ప్రపంచంలోని పలు అతిపె ద్ద కంపెనీలకు సీఈవోలుగా ఉన్నారు. ఇప్పుడు ప్రపంచం మొత్తం భారత్‌ వైపు చూస్తోంది. భారత్‌ అనుసరిస్తున్న ఆర్థిక, సామాజిక, విద్యావిధానాల్ని ప్రపంచం అధ్యయనం చేస్తోంది.. గతంలో ఎన్నడూ లేని స్థాయిలో భారత్‌లోకి విదేశీ పెట్టుడులు ప్రవహిస్తు న్నాయి. మరింత వేగంగా అభివృద్ధిలో దూసుకుపోతోందంటూ ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ 20వ వార్షికోత్సవ సభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మోడి చేసిన ప్రసంగం విద్యార్థులతోపాటు దేశవ్యాప్తంగా యువతను తీవ్రంగా ఉత్తేజపర్చింది. మోడికి హైదరాబాద్‌ వాసులు బ్రహ్మరథం పట్టారు. దారివెంబడి యువత మోడిని చూసేందుకు పోటీలు పడ్డారు. మోడి వాహనశ్రేణిని చూసి కేరింతలు కొట్టారు. గతంలో పురుషులు మాత్రమే ఇలా రోడ్లపైకొచ్చి పాలకులు, అభిమాన నాయకుల్ని చూసేందుకు ఎగబడేవారు.

కానీ మోడి కోసం పురుషులతో సమానంగా స్త్రీలు కూడా ఎదురుచూశారు. రోడ్లపై బారులుదీరారు. అలాగే ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌లో విద్యార్థులతో సమానంగా విద్యార్థినులు కూడా గొప్ప గొప్ప ఫలితాలు సాధించారు. బంగారు ప తకాలు పొందారు. పరీక్షల్లో అత్యున్నత ర్యాంకుల్ని కైవసం చేసుకున్నారు. అలాగే సభలో విద్యార్థులతో సమాన స్థాయిలో విద్యార్థినులున్నారు. ఇది భారత్‌లో విద్య, సామాజిక అంశాల్లో లింగ సమానత్వానికి అద్దంపట్టింది. దీర్ఘకాలంగా భారత్‌ అంటే ఓ సంస్కృతి, సంప్రదాయాల తెరచాటున సనాతన ఆచారాలు, ఆంక్షలతో మహిళల్ని అణగదొక్కే దేశంగా ముద్రపడిపోయింది. కానీ గత కొన్ని దశాబ్దాలుగా లింగ సమానత్వంలో తీవ్ర మార్పులొచ్చాయి. ముఖ్యంగా విద్యావకాశాల్ని అందిపుచ్చుకుని బాలురు కంటే పైచేయి సాధించడంలో బాలికలు విజయవంతమయ్యారు. ఉన్నత విద్యలోనూ వారు రాణిస్తున్నారు. అలాగే పాలనలోనూ తమ ప్రత్యేకతను నిరూపించుకుంటున్నారు.

ఇప్పటికీ పలు దేశాల్లో మహిళల్ని ఇళ్ళకే పరిమితం చేసిన సంప్రదాయాలున్నాయి. కేవలం ఇంటి పని, పిల్లల్ని కని పోషించడానికే మహిళలన్న అభిప్రాయాలు కొన్ని దేశాల్లో కొనసాగుతున్నాయి. అమెరికా, యూరోప్‌ల్లో మాత్రమే మహిళలు పురుషులతో సమానంగా అన్నిరంగాల్లో పోటీ పడుతున్నారన్న ప్రచారం ఉంది. అమెరికా ఉపాధ్యక్ష పదవి నుంచి పలు దేశాల అధ్యక్షులు, పాలకులుగా మహిళలున్నారు. కానీ ఇప్పుడు భారత్‌ వీరందర్నీ మించిపోతోంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన విద్యాభ్యాసంలో భారతీయ మహిళలు అగ్రగామిగా నిలుస్తున్నారు. వారికి ప్రభుత్వం అన్ని విధాలా చేయూతనిస్తోంది. విద్యావకాశాల్ని మెరుగుపరుస్తోంది. ఆర్థికంగా ఆసరా కల్పిస్తోంది. ప్రపంచ స్థాయి సాఫ్ట్‌వేర్‌ దిగ్గజ సంస్థలతో పాటు పలు ఆర్థిక సంస్థల సీఈవోలుగా ఇప్పటికే భారతీయులు తమ ప్రావీణ్యతను ప్రదర్శిస్తున్నారు. ఈ స్థాయికి ఎదిగేందుకు భారతీయ విద్యార్థినుల్లోనూ ఆసక్తి రగిలింది. అయితే అందుకనుగుణంగా కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రాలు కూడా తగిన సహకారం అందించాలి. మహిళా విద్యకు పెద్దపీటేయాలి. ఆధునిక వసతులు అందుబాటులోకి తేవాలి. విద్యాభ్యాసం చేస్తున్న మహిళలకు తగిన భద్రత కల్పించాలి. అప్పుడే అంతర్జాతీయ స్థాయిలో కూడా పురుషులతో పోటీపడి భారతీయ మహిళలు రాణించే అవకాశం అందుబాటులోకి వస్తుందని పరిశీలకులు పేర్కొంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement